బీజింగ్: ఒమిక్రాన్ వేరియంట్ బిఎఫ్.7 చైనాలో కల్లోలం సృష్టిస్తోంది. అక్కడ ఈ వారంలో ఒక్క రోజే 3.7 కోట్ల మంది కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఒకే రోజున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 4 కోట్ల మందికన్నా కూడా ప్రస్తుత సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని చైనా ఆరోగ్య వాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాజధాని బీజింగ్‌తో పాటుగా సిచువాన్ ప్రావిన్స్‌లో సగానికి పైగా నివాసితులు కరోనా బారిన పడినట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న చైనాలోని 18 శాతం జనాభాకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. బుధవారం జరిగిన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సి) అంతర్గత సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ద్వారా ఈ విషయం తెలిసిందని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.ఈ నెల 20న 3.7 కోట్ల కేసులు లెక్క వేయగా, అధికారికంగా మాత్రం 3,049కేసులను మాత్రమే పేర్కొన్నారని వెల్లడించింది.
అయితే కరోనా వల్ల చైనాలో ఎంతమంది మరణిస్తున్నారో అంచనాలు ఆ మినిట్స్‌లో లేవని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. కాగా ఇప్పటివరకు చైనా జీరో కొవిడ్ విధానాన్ని పాటించిన విషయం తెలిసిందే. అయితే ఆ విధానంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు ఈ విధానంలో మార్పు చేశారు. అలాగే కొవిడ్ ఆంక్షలను సడలించారు. ఈ నేపథ్యంలో కరోనా టీకా తీసుకోని ఆ దేశ ప్రజలు పెద్ద సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్ సహా పలు ప్రావిన్స్‌లలో కరోనా కేసులు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోయిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరస్ పట్టణ ప్రాంతాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తూ ఉండడం చైనా అధికారులను కలవరపెడుతోంది. రాబోయే కొద్ది నెలల్లో చైనాలో కోట్లాది మంది కరోనా వైరస్ బారిన పడనున్నట్లు అంటువ్యాధుల నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే మరణాల సంఖ్య కూడా లక్షల్లో ఉండవచ్చని వారంటున్నారు.