హైదరాబాద్: హైదరాబాద్ టాలీవుడ్ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ (87) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ సీనియర్ నటుడు ఇహలోకాన్ని వీడారు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు అజేయంగా సాగిన తన కెరీర్‌లో కైకాల సత్యనారాయణ 777కు పైగా చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాల సత్యనారాయణ 101 చిత్రాల్లో నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో కైకాల నటించారు. సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించారు. ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశారు. ప్రతినాయక, నాయక, హాస్య, సహాయ పాత్రలనెన్నింటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తింపుగా ఆయన నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఆయన ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో కైకాల సత్యనారాయణ సినీరంగప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించారు. లవకుశ, పాండవ వనవాసం, పరమానందయ్య శిష్యుల కథ, ప్రేమనగర్, తాతా మనవడు, – జీవన జ్యోతి, సిరిసిరిమువ్వ, దాన వీర శూర కర్ణ, – యమగోల, శుభలేఖ, శ్రుతిలయలు, రుద్రవీణ, నారీ నారీ నడుమ మురారి, గ్యాంగ్ లీడర్, భైరవ ద్వీపం, సాహసవీరుడు – సాగరకన్య, సమరసింహారెడ్డి, మురారి, అరుంధతి తదితర విజయవంతమైన సినిమాల్లో కైకాల సత్యనారాయణ నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
కైకాల సత్యనారాయణ కొంత కాలం రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండి 11వ లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి టిడిపి తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఫిలింనగర్‌లోని కైకాల సత్యనారాయణ స్వగృహానికి వచ్చి సిఎం కెసిఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఆయన భౌతిక కాయానికి పూలమాలలతో తుది నివాళులర్పించారు. వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కళ్యాణ్, వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మోహన్‌బాబు, మంచు లక్ష్మీ, బ్రహ్మానందం, విజయేంద్ర ప్రసాద్, కోదండ రామిరెడ్డి తదితరులు కైకాల భౌతిక కాయానికి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ఇక కైకాల భౌతికకాయానికి శనివారం మహాప్రస్థానం స్మశానవాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర: సిఎం కెసిఆర్
ప్రముఖ నటుడు, మాజీ ఎంపి కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా,మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సిఎం గుర్తుచేసుకున్నారు. ఆయనమరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. నవరస నట సార్వభౌమునిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కైకాల అనేక అవార్డులు అందుకున్నారని, తెలుగు ప్రజలు గర్వించదగ్గ విలక్షణ నటుడుగా, లోక్ సభ సభ్యునిగా దివంగత కైకాల సత్యనారాయణ చేసిన కళాసేవ, ప్రజా సేవ గొప్పదని సిఎం అన్నారు. కైకాలతో తనకున్న అనుబంధాన్ని ఆయన స్మరించుకున్నారు. కాగా కైకాల చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
కాగా బంజారాహిల్స్‌లోని కైకాల నివాసానికి వెల్లిన సిఎం కెసిఆర్ సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుమారులను, కూతుల్లను కుటుంబ సభ్యులను సిఎం ఓదార్చారు. వారికి ధైర్యవచనాలు చెప్పి కాసేపు పరామర్శించారు. అనంతరం అక్కడే వున్న మీడియా ముందుకు వచ్చి నటుడుగా ఎంపీగా కైకాలతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సిఎం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, కైకాల సత్యనారాయణ గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ రోజు వారు మరణించడం చాలా బాధాకరన్నారు. సినీ హీరోలతో పోటీపడుతూ చాలా అద్భుతంగా నటించే వారాయన అని వ్యాఖ్యానించారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో నటించి, అద్భుతమైన పేరు తెచ్చుకున్న వ్యక్తి కైకాల అని అన్నారు. తాను కొంతకాలం వారితో కలిసి పనిచేయడం కూడా జరిగిందన్నారు. ఆ కాలంలో వారితో కొన్ని అనుభవాలను కూడా పంచుకున్నామన్నారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ సీనియర్ నటుడు కైకాలను కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సిఎం వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్‌సిలు ఎస్.మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్ రెడి,్డ ఎంఎల్‌ఎలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, బాల్క సుమన్‌తో పాటు వేణుగోపాలాచారి, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.