మన తెలంగాణ / హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్ విద్యార్థి ఆవుల ఉమాకాంత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (పైలట్ ఆఫీసర్) గా ఎంపికయ్యాడు. రుక్మాపూర్ గురుకుల సైనిక్ స్కూల్ కు చెందిన అవుల ఉమాకాంత్ పూనెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమిలోచేరాడు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరి రాహుల్ బొజ్జా, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రోస్ ఉమాకాంత్‌ను అభినందించారు. గురుకుల సైనిక్ స్కూల్ నుండి ఎంపికైన రెండవ అభ్యర్థి ఉమాకాంత్ కావడం గమనార్హం. రుక్మాపూర్ సైనిక్ స్కూల్ 2018లో స్థాపించబడింది. రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు రక్షణ దళంలో చేరడానికి శిక్షణ ఇచ్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉమాకాంత్ మాట్లాడుతూ నాలాంటి వారికోసం ప్రత్యేక సైనిక్ స్కూల్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. భారత వైమానిక ధళ పైలట్ అవుతానని కలలో కూడ ఊహించలేదని దేశానికి సేవ చేసే అవకాశం కల్గినందుకు గర్వంగా ఉందని అన్నాడు. బీబీ నగర్‌కు చెందిన ఉమాకాంత్ తండ్రి డేటా ఎంట్రి ఆపరేటర్‌గా, తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోడానికి పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఉమాకాంత్, తన విజయానికి సైనిక్ స్కూల్‌లో శిక్షన నిచ్చిన అధ్యాపకులు, రోనాల్డ్ రాస్ సహకారం కారణమని చెప్పాడు.
అట్టడుగు స్థాయి నుండి భారత వైమానిక దళానికి అధికార కేడర్‌కు ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయన ఉమాకాంత్‌ను అభినందించారు. గురుకుల సొసైటి కార్యదర్శి రోనాల్డ్ రాస్, అతని బృందం అంకిత భావతంతో చేసిన కృషి అని అభివర్ణించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు దీని క్రెడిట్ దక్కుతుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరి రాహుల్ బొజ్జా , రోనాల్డ్ రాస్‌లు ఉమాకాంత్ ను అభినందించారు. సైనిక్ స్కూల్ నిబద్దతను కొనియాడారు.