చేతిలో కత్తి వున్నవాడికి బుర్రలేకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయో ఊహకందని విషయం కాదు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వ సారథులకే మెదడు కొరవడితే ఇంకా ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో ఇటీవల వార్తలకెకిన రెండు విపరీత పరిణామాలు చాటుతున్నాయి. ఇందులో ఒకటి అనుమతించని పథకాల కింద ఖర్చు చేసిన రూ. 151.9 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను తెలంగాణకు రావలసిన జి.ఎస్.టి బకాయిల నుంచి కేంద్రం మినహాయించుకొన్న దన్న వార్త కాగా, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోడం లేదని కేంద్రం రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేసిందన్న సమాచారం రెండోది. దేశంలో ఇప్పుడు నడుస్తున్న రాజకీయాన్ని గమనించేవారెవరైనా ఈ రెండు పరిణామాల వెనక గల రహస్యాన్ని సునాయాసంగా తెలుసుకోగలరు.
ప్రధాని మోడీ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా బలమైన గొంతు విప్పిన రాష్ట్రాల్లోని బిజెపియేతర పాలక పార్టీలను సద్దుమణిగించాననే బలగర్వంతో వుంది. దానికి గట్టి అవరోధం తెలంగాణ నుంచే ఎదురవుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి నిన్నటి టిఆర్‌ఎస్, నేటి బిఆర్‌ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖర రావు తలపెట్టిన రైతు భారత విప్లవ కార్యాచరణ అందరికీ తెలిసిందే. ఆయనొక్కరే ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రభుత్వానికి అలవికాని సమస్యగా వున్నారు. సహేతుక కారణాలపై దేశంలో సమూలమైన మార్పు తీసుకు రాడానికి బిఆర్‌ఎస్‌ను నెలకొల్పి ముందుకు తీసుకు వెళుతున్నారు. ఇది బొత్తిగా గిట్టని భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి కెసిఆర్ పాలనను లక్షంగా చేసుకొని విష అస్త్రాలను సంధిస్తున్నది.
ఈ రెండు నిర్ణయాలు అటువంటి తాజా బాణాలే. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వచ్చిన నిధులను రైతుల పంట నూర్పిళ్లకు కల్లాలను ఏర్పాటు చేసుకోడానికి ఉపయోగించడం తెలంగాణ ప్రభుత్వం చేసిన నేరంగా కేంద్రానికి తోచడం చెప్పనలవికాని విడ్డూరం. ఇందులో తెలంగాణ పాలకులు చేసిన అన్యాయమూ, అప్రజాస్వామికమూ ఏముందో కేంద్రంలోని ఏలిన వారే వివరిస్తే బాగుంటుంది. కేవలం గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుమతించిన వాటిలో లేని కార్యక్రమం అయినందున కల్లాలకు ఆ నిధుల వినియోగాన్ని కేంద్రం తప్పుపట్టింది. అలా వినియోగించిన నిధులను అవ్యవధిగా తిరిగి చెల్లించాలని తాఖీదు జారీ చేసింది. రైతులు నూర్చిన వడ్లను ఇతర ధాన్యాలను రోడ్ల మీద ఆరబెట్టుకోడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారని సుప్రీంకోర్టు స్వయంగా అభిప్రాయపడింది.
అందుచేత రోడ్లపై ఆరబెట్టే రైతులను అరెస్టు చేయాలని, వారికి జరిమానాలు విధించాలని ఆదేశించింది. అందుకు ఏకైక విరుగుడు రైతు తన పొలంలోనే కల్లాన్ని ఏర్పాటు చేసుకోడం. ఈ రైతు సంక్షేమ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను వినియోగించింది. 40,199 మంది రైతులకు నిధులు కేటాయించింది. ఆ డబ్బును రాష్ట్రానికి రావలసిన జిఎస్‌టి బకాయిల నుంచి కేంద్రం మినహాయించుకొంది. ఇదెంత దుర్మార్గమైన పనో తలకాయ మీద మెడకాయ గలవారెవరికైనా సునాయాసంగా అర్థమవుతుంది. ఇదే సమయంలో ఇదే పద్ధతిని పాటిస్తున్న బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను నిధులు వెనక్కివ్వాలని కేంద్రం అడగకపోడం లోని ఆంతర్యం ఏమిటి? అలాగే పొరుగునున్న ఎపి ప్రభుత్వం చేపలు ఆరబెట్టుకొనే సౌకర్యం కోసం ఉపాధి నిధులను కేటాయిస్తే అదేమిటని కేంద్రం ప్రశ్నించలేదు.
ఇది తెలంగాణ ప్రభుత్వాన్ని వేరు చేసి వేటు వేయడమే కదా! రైతుల శ్రమను, భూమిని కార్పొరేట్ యాజమాన్యాలకు దోచిపెట్టడానికి ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు క్రూర చట్టాల గురించి, వాటి అంతు చూసిన సుదీర్ఘ రైతు ఉద్యమం గురించి వివరించి చెప్పనక్కర లేదు. అప్పటి నుంచి కేంద్ర పాలకులు దేశంలోని రైతాంగంపై కక్ష వహించి వున్నారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి సమాధి కడుతున్నారు. దేశంలోని సామాజిక సామరస్యాన్ని బలి తీసుకొంటున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా దేశ ప్రజలను కూడగట్టడం కోసం కెసిఆర్ నడుం బిగించారు. ఆయన కాళ్ళకు బంధాలు వేసేందుకు పలు విధాలైన పగ సాధింపుకి కేంద్రం సాహసిస్తున్నది.
రాష్ట్రంలో సంక్షేమం ముందుకు సాగకుండా చేయడానికి రాష్ట్రానికి రావలసిన నిధులను పట్టి వుంచుతున్నది. అలాగే పైసా రుణం పుట్టకుండా మడత పేచీలు పెడుతున్నది. ఇవి చాలక దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రతిపాదనను రద్దు చేసింది. ఈ ఫ్యాక్టరీ వస్తే తెలంగాణలోని యువతకు ఉద్యోగావకాశాలు విరివిగా లభించి వుండేవి. కేంద్రం ఈ ఫ్యాక్టరీని అసోంలోని కొక్రాఝార్‌కు తరలించినట్టు తెలుస్తున్నది. ప్రజల మేలు కోరి దేశంలో ప్రత్యామ్నాయ శక్తులను అధికారంలోకి తీసుకురాడం కోసం ప్రయత్నించే వారిపై బిజెపి పాలకులు తీసుకుంటున్న కక్ష సాధింపు చర్యలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి.