Wednesday, January 22, 2025

క్రీస్తు బాటలో నడిస్తే ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవు: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచమంతా అత్యంత ఘనంగా జరుపుకుంటున్న కిస్మస్ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడారు. అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమన్నారు. క్రీస్తు బాటలో నడిస్తే ఈ ప్రపంచంలో మోసాలు, పాపాలు ఉండవని, యుద్దాలకు ఆస్కారం లేదని అన్నారు. అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అన్న ఏసుక్రీస్తు ప్రభోదం మేరకు సిఎం కెసిఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ అన్ని మతాల ముఖ్య పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

అంతే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ సోదరుల ఆత్మగౌరవం పెంపొందించేలా వారికి 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవనం నిర్మించడానికి కూడా శంకుస్థాపన చేశామన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ అని ఎర్రబెల్లి తెలిపారు. క్రిస్టియన్ విద్యార్థులు నాణ్యమైన విద్య పొందేందుకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నారని, విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. క్రిస్టియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఎం పవర్ మెంట్ కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందిస్తున్నారని, ఉపాధి శిక్షణ ఇస్తున్నారని, 10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో రుణాలు కల్పిస్తున్నారని వివరించారు.

ఇప్పటి వరకు 1718 మందికి 19 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందించిందన్నారు. జెరూసలేంకు వెళ్లే క్రిస్టియన్ భక్తులకు ప్రయాణ వసతులు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అన్నారు. టిఎస్ ప్రైమ్ కింద క్రిస్టియన్ మైనారిటీ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నారని, ఐటి పారిశ్రామిక వేత్తల కోసం ఐటి పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలా క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో కృషి చేస్తోందని, దీనిని క్రిస్టియన్లందరూ గుర్తించి కెసిఆర్ కు మద్దతుగా నిలబడాలని ఎర్రబెల్లి కోరారు. మరోసారి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News