హైదరాబాద్ ః కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఐరన్ ఓర్ మైనింగ్ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బిజెపి పార్టీకి రాజీనామా చేశారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే గంగావతి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ కార్యచరణను ఆయన ప్రారంభించారు. తన భార్యతో కలిసి గంగావతిలో పర్యటనలు చేస్తున్నారు. గత కొంతకాలంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపి నేతల పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల గంగావతి నియోజకవర్గంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ. 6 కోట్లు విరాళం ఇవ్వనున్నట్లు గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన అక్కడి బిజెపి శ్రేణుల్లో గందరగోళానికి గురిచేసినట్లు తెలుస్తోంది.
దీంతో జనార్దన్ రెడ్డి బిజెపి నాయకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీని ఆయన ప్రకటించారు.ఈ మేరకు ఆదివారం తన సొంత నివాసం పారిజాత భవనంలో మీడియాతో గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడారు.. ఇకపై సొంత పార్టీతో రాజకీయాల్లో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని వెల్లడించారు. బిజెపితో తన బంధం ముగిసిందని స్పష్టం చేశారు. కర్ణాటక ప్రజల హృదయాలను తమ పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామన్నారు. త్వరలో ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. తాను స్వయంగా గంగావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.