బీజింగ్: కరోనా పుట్టినిల్లయిన చైనాలో తాజాగా కొవిడ్ విజృంభణ ఊహించిన దానికన్నా భయంకరంగా ఉంది. అక్కడ డిసెంబర్ నెల తొలి 20 రోజుల్లో 25 కోట్ల మందికి వైరస్ సోకింది. బుధవారం జరిగిన చైనా నేషనల్ హెల్త్ కమిషన్ సమావేశంలో ఈ లెక్క బైటికి వచ్చినట్లు ‘బ్లూమ్‌బెర్గ్’, ‘ఫైనాన్స్ టైమ్స్’ పత్రికలు పేరొన్నాయి. నేషనల్ హెల్త్ కమిషన్ సమావేశ వివరాలున్న నోట్ శుక్రవారం చైనా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఇదే నిజమైతే చైనాలో ఉన్న 140 కోట్ల జనాభాలో 18 శాతం మంది వైరస్ బారిన పడినట్లవుతుంది. చైనా ఎన్‌హెచ్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్ సున్‌యాంగ్ అంచనాల ప్రకారం దేశంలో కొవిడ్ వ్యాప్తి రేటు ఇంకా పెరుగుతోంది. బీజింగ్‌నగరం, సిచువాన్ ప్రావిన్స్‌లో దాదాపు సగం మందికి కొవిడ్ సోకినట్లు ఆ సమావేశంలో అంచనా వేశారు.
అయితే వాస్తవానికి ఈ 20 రోజుల్లో చైనా అధికారికంగా ప్రకటించిన కేసుల సంఖ్య 62,592 మాత్రమే. ఈ నెలలో ఒక్కరు మాత్రమే మరణించినట్లు వెల్లడించింది. ఇక చైనాలో ఇప్పటివరకు 80 ఏళ్ల పైబడిన వృద్ధుల్లో 42 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ తీసుకొన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చైనాలోని క్విగ్‌డాంగ్ నగరంలో ఒక్క రోజులోనే 5,30,000 కేసులు వచ్చినట్లు మున్సిపల్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వార్త చైనా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అధికారులు దాన్ని తొలగించారు. చైనాలోని గ్రామాల్లో సైతం కరోనా వ్యాప్తి మొదలైంది. ఫలితంగా ఇప్పటికే గ్రామాల్లోని ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసి పోయాయి.
రోజువారీ కేసులు చెప్పేది లేదన్న ఎన్‌హెచ్‌ఎస్
ఈ నేపథ్యంలో ఆదివారంనుంచి చైనాలో కొవిడ్ కేసుల సంఖ్యను అధికారికంగా ప్రకటించబోమని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది. కొవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ విభాగం ప్రచురిస్తుందని తెలిపింది. రిఫరెన్స్, రీసెర్చ్ కోసమే దీన్ని వెల్లడిస్తుందని తెలిపింది. అయితే, ఈ మార్పునకు కారణాలను కానీ, ఎప్పటినుంచి ఈ వివరాలను ఆ విభాగం వెల్లడిస్తుందనే సమాచారాన్ని కానీ అది తెలియజేయలేదు.