Friday, January 10, 2025

చలపతిరావు హఠాన్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  టాలీవుడ్‌లో వరుస విషాదాలు కలచివేస్తున్నాయి. నవరసనటనాసార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణాన్ని మరిచిపోక. మరో సీనియర్ నటుడు చలపతిరావు(79) శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఐదున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం లో 1200కు పైగా సినిమాలలో నటించిన చలపతిరావు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నటుడుగానే కాకుండా నిర్మాతగాను 7 సినిమాలను చలపతిరావు నిర్మించారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎన్టీఆర్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్న పాత్రతో మొదలైన కెరీర్ ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ,
చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి స్టార్ సినిమాల్లో నటించారు.

కారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నటుడు, దర్శకుడు రవిబాబు ఆయన తనయుడే. ఆదివారం ఆయన పార్థివదేహాన్ని బంజారాహిల్స్ ఎంఎల్‌ఎ కాలనీలోని తన కుమారుడు దర్శకుడు రవి బాబు ఇంటి వద్ద ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంకు తరలించి ఫ్రీజర్‌లో ఉంచారు. అమెరికాలో ఉంటున్న చలపతిరావు కుమార్తెలు రాగానే బుధవారం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుపుతారు.
సిఎం కెసిఆర్ సంతాపం
ప్రముఖ సినీ నటుడు టి. చలపతిరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతాపాన్ని తెలిపారు. వైవిధ్యంతో కూడిన పలు రకాల పాత్రల్లో వందలాది చిత్రాల్లో నటించిన చలపతిరావు, తెలుగు వెండితెరపై తనదైన ముద్ర వేశారని సిఎం అన్నారు. నటుడిగా, నిర్మాతగా, మూడు తరాల నటులతోనూ పనిచేసిన చలపతిరావు మరణం, సినీ రంగానికి తీరని లోటు అని కెసిఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News