హైదరాబాద్: తెలంగాణకు త్వరలో వందే భారత్ ట్రైన్ వస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ ట్రైన్‌ను నడపాలని నిర్ణయించారని, ట్రాక్‌ను అప్ గ్రేడ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. భద్రాచలం, రామప్ప పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామన్నారు. రామప్ప అభివృద్ధికి రూ.70 కోట్లు నిధులు కేటాయించగా, వాటిలో రూ.60 కోట్లు ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగిస్తామన్నారు.
మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.. ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. తమకు న్యాయవ్యవస్థల పట్ల విశ్వాసం ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు రాష్ట్ర ప్రజలకు తెలియాల్సివుందన్నారు. తెలంగాణలో బిజెపి ఎదుగుదలను జీర్ణించుకోలేకే మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎంఎస్‌ఎల కొనుగోలు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.