Monday, December 23, 2024

మోడీ ‘ఫెయిల్’!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆయన సాక్షాత్తు దేశాధినేత.. ఆయన మాట ఇస్తే ఇక ఆరునూరైనా అమలు జరిగితీరాల్సిందే. వ్యవసాయరంగంలో రైతుల అదాయాన్ని 2022నాటికి రెట్టింపు చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వస్తుంటే అయన మాటలు దేశ ప్రజలందరూ నమ్మారు. ప్రత్యేకించి ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులను ‘ రెట్టింపు ఆదాయం ’ అన్న ప్రకటనలు ఆశల పల్లకిలో విహరింపచేశాయి.

తీరా 2022 సంవత్సరం ముగిసిపోవచ్చింది. రైతులకు మాట ఇచ్చిన ఆ దేశాధినేత మరోవరో కాదు మన ప్రధానమంత్రి నరేంద్రమోడి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోతే పోని ..కనీసం రైతును ఉన్న స్థితిలో ఉండనీయకుండా చేశారు. పంటల సాగులో విత్తనాలు మొదలు కొని, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు , డిజిల్ ధరలు పెంచివేశారు. నిత్యావసర ధరలు పెరగటంతో వ్యవసాయ కూలీల ధరలు పెరిగి ఆ భారం కూడా పరోక్షంగా పంటలసాగుపైనే పడింది. 2022నాటికి వ్యవసాయరంగంలో రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంలో ఘోరంగా విఫలం చెందిన ప్రధాని మోడి సాగు ఖర్చులు పెంచటంలో మాత్రం సఫలం అయ్యారన్న విమర్శలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆర్ధగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవసాయరంగానికి సంబంధించి దేశంలో రైతు కుటుంబాల సగటు రాబడి రూ.9403 అని కుండబద్దలు కొట్టి కేంద్రప్రభుత్వం వ్యవసాయరంగం పట్ల చేస్తున్న కృషిలో డొల్లతనాన్ని బయట పెట్టింది. ఇటీవల పార్లమెంట్‌లో వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతుల ఆదాయం 60శాతం పెరింగిందని ప్రకటించి రైతుల్లో నవ్వుల పాలయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరేళ్లలో ద్రవ్యోల్బణం 35.3శాతం ఉంటే దాన్ని దాచి కేంద్రమంత్రి పార్లమెంట్‌లో రైతుల ఆదాయంపై మసిబూసి మారేడు కాయ చేసేప్రయత్నం వికటించింది.

రైతు కుంటుంబం సగటు నెల రాబడి 201213లో రూ.6427 ఉండగా , 2018నాటికి ఇది రూ.10,218కి చేరి పెరుగుతున్న సాగు ఖర్చులతో తిరోగమన బాట పట్టింది. 2022నాటికి ఇది రూ.9403కు పడిపోయిందని రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. కేంద్రలో నరేంద్ర మోడి ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరానికి వ్యవసాయశాఖకు చేసిన కేటాయింపు రూ.1,24,000కోట్లు మాత్రమే. పంటల సాగులో ఇన్‌పుట్ సబ్సిడిలను పెంచి రైతులను ప్రోత్సహించకపోగా ఆహారధాన్యాల ఉత్పత్తలో మాత్రం లక్ష్యాలను 308 మిలియన్ల మెట్రిక్ టన్నుల నుంచి 315మిలియన్ల మెట్రిక్ టన్నులకు పెంచింది. ఒవవైపు రసాయనిక ఎరువుల ధరలను పెంచిన కేంద్రం ఆదే నిష్పత్తిలో పంటలకు మద్దతు ధరలు పెంచటంలో మాత్రం విఫలం చెందింది.

పిఎం కిసాన్ పథకంలో 74లక్షల మందికి మొండిచేయి

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో ఇపుడిస్తున్న రూ.6వేలు చాలటం లేదని, దీన్ని రూ.15వేలకు పెంచాలని రైతులు , రైతుసంఘాలు జాతీయ స్థాయిలో ఘోషిస్తున్నాయి. పథకం ప్రారంభించి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా పెంచలేదు. పైగా పిఎం కిసాన్ సమ్మాన్ పథకంలో ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్యను 11.74కోట్ల నుంచి 11కోట్లకు కుందించింది. 74లక్షల మంది రైతులను ఈ పధకం నుంచి తొలగించింది. దేశమంతటా రైతులకు ఇస్తున్న మొత్తం రూ.2లక్షల కోట్లకు మించటం లేదు.కిసాన్ క్రిడిట్ కార్డుల సంఖ్యను కూడా 376లక్షల వద్దనే నిలిపివేసింది.

ఈ పథకం ద్వారా ఇస్తున్న క్రెడిట్ లిమిట్ కూడా అన్ని రాష్ట్రాలకు కలిపి ఏటా రూ.4,33,426కోట్లు కాగా , ఒక్క తెలగాణ రాష్ట్రంలో ఇక్కడి కేసిఆర్ ప్రభుత్వం ఏటా రైతులకు బ్యాంకుల ద్వారా వ్యవసాయం వాటి అనుబంధరంగాలకు రూ1,12,762కోట్లు రుణాలు అందజేయిస్తోది. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు స్కీంతోపోలిస్తే తెలంగాణ ప్రభుత్వం ఏటా 25శాతం ఇక్కడే అమలు చేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణలో కూడా కేంద్రం నామమాత్రపు నిధులలో సరిపెడుతోంది. వ్యవసాయోత్పత్తుల ఎగుమతి విధానాలపై మోడి సర్కారు దాటవేతధోరణి అటుంచి, పంటల సీజన్‌లో ఎగుమతులుపై నిషేధం విధించి ధరలు తొక్కిపెట్టి రైతుల కడుపు కొడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News