మహబూబ్ నగర్ : పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో బాధ్యతను పెంపొందింపజేసేందుకు సమాచార హక్కు చట్టం అవసరమని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ అన్నారు.సమాచార హక్కు చట్టంపై పాలమూరు విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .పౌరులందరూ సమానంగా బ్రతికే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అందరూ సమానంగా ఉండాలన్న ఉద్దేశంతో సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 7(3) ప్రకారం ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం కింద సమాచారం పొందే హక్కును కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రజాప్రయోజనాలు, ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చని , ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వం ద్వారా ప్రత్యక్షంగా ,పరోక్షంగా ప్రయోజనం పొందుతున్న అన్ని రకాల సంస్థలు సమాచారాన్ని ఇచ్చే బాధ్యత ఉంటుందని ,అదేవిధంగా సమాచారాన్ని తెలుసుకోవాల్సిన విధి ప్రతి పౌరునిపై ఉందని అన్నారు.
సమాచార హక్కు చట్టం సామాన్య ప్రజలకు ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని, కోరిన సమాచారాన్ని ఆయా కార్యాలయాలలోని పౌర సమాచార అధికారులు 30 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుందని ,లేనట్లయితే అప్పీల్ కి వెళ్లే అధికారం పౌరులకు ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు సమాచార హక్కు కమిషన్ కు 39వేల అప్పీల్స్ రాగా, 33,000 అప్పీళ్లను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు .కరోనా సమయంలో సైతం టెలిఫోన్ ద్వారా సమాచార హక్కు చట్టం కింద వచ్చిన అప్పీళ్లను పరిష్కరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన వెల్లడించారు.
సమాచారం కోసం పౌరులు పౌర సమాచార అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన న్యాయం జరిగనప్పుడు రెండవ అప్పీల్ కింద తమ కమిషన్ ను సంప్రదిస్తే అలాంటి అప్పీళ్ల పై కేవలం 3 నుండి 6 నెలల్లో సమాచారాన్ని ఇప్పిస్తున్నామని కొన్ని కేసులలో పౌర సమాచార అధికారులపై జరిమానా విధించడం, నష్టపోయిన వారికి నష్టపరిహారాన్ని ఇప్పించడం వంటివి కూడా చేసినట్లు ఆయన వెల్లడించారు.
పౌరులు ఈ చట్టం ప్రకారం సమాచారం పొందే హాకుతోపాటు, సెక్షన్ 2( జే) కింద నేరుగా రికార్డులను పరిశీలించుకునే అధికారం కూడా ఈ చట్టం కల్పించిందని ,వ్యక్తిగత విషయాలు తప్ప చట్టం పరిధిలో ఉన్న అన్ని విషయాలను పౌరులకు వెల్లడి చేయవచ్చని ,అయితే పౌరులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయవద్దని ఆయన కోరారు . ముఖ్యంగా అధికార యంత్రాంగం లో బాధ్యతను, పారదర్శకతను పెంపొందించే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం దేశంలో తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఎక్కువమంది గ్రామీణ నేపథ్యంలో నుంచి వచ్చిన వారే ఉంటారని, జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అది సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. ఎంతోమంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివిన వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థి జీవితం మనిషి జీవితంలో క్రియా శీలకమని ఆయన తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,అలెగ్జాండర్, వంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు. యువ శక్తి వృధా కాకుండా, కష్టపడి పనిచేసి సమాజానికి ఉపయోగపడాలని, చెడు వ్యాసనాల జోలికి వెళ్ళవద్దని ఆయన పిలుపునిచ్చారు.
పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎల్ .బి. లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించే నిమిత్తం ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది వారికి విద్యతో పాటు, ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రతి పౌరుడికి సమాచార హక్కు చట్టం ఎంతో విలువైందని అన్నారు. విద్యార్థుల్లో శిక్షణ నైపుణ్యాలను పెంపొందించడంలో ఈ చట్టం ఉపయోగపడుతుందని ,అయితే ఈ చట్టం దుర్వినియోగం కాకుండా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె. గిరిజా మంగతాయారు, ఐక్యూ ఏసీ డైరెక్టర్ మరియు ఓ ఎస్ డి మధుసూదన్ రెడ్డి, ఆచార్య పిండి పవన్ కుమార్, డిపిఆర్ఓ యు. వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ కిషోర్, పిఆర్వో అర్జున్ కుమార్, యూనివర్సిటీ అధ్యాపకులు ,ఎంవిఎస్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, విద్యార్థులు ఈ వర్క్ షాప్ కు హాజరయ్యారు.