ఇంద్రవెల్లి : మండలంలోని మర్కగూడా పంచాయతీ పరిధిలోని బుర్సన్ పటార్ గ్రామంలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో జనాభా 550, ఇండ్లు 85, బోర్వెల్ 5, ఉన్నాయి. గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావట్లేదని వాపోతున్నారు. కిలో మీటరు దూరం నుండి నీటిని తీసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. తమ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తాము కష్టాలలో ఉంటే పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఎన్నికలలో వచ్చే నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.
నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి (సోన్ కాంబ్లే పీరాజీ)
తమ గ్రామంలో వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రావట్లేదని సోన్ కాంబ్లే పీరాజీ పేర్కొన్నారు. నీటి కోసం కిలో మీటరు వరకు నడవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరుతున్నారు.
కాలేజ్‌కు వెళ్లడానికి లేట్ అవుతుంది (జి. మిలింద్,)
నీటి సమస్య కారణంగా కాలేజ్‌కు వెళ్లడానికి లేట్ అవుతుందని మిలింద్ అన్నారు. తమ గ్రామంలో బోరు బావి వేయించాలని ప్రభుత్వానికి కోరుతున్నాడు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించకుంటే ఎంపీడీవో కార్యాలయం ముట్టడిస్తాం (గోవింద్ గాయక్వాడ్)
ప్రజా ప్రతినిధులు అధికారులు నీటి సమస్యలపై స్పందించకుంటే గ్రామస్తులతో కలిసి ఎంపిడివో కార్యాలయంను ముట్టడిస్తామని మిలింద్ గాయక్వాడ్ హెచ్చరించారు. ఎన్నికలలో వచ్చే రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.