కరీంనగర్: వరంగల్ -కరీంనగర్ (ఎన్ హెచ్ 563) హైవే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతున్న దృశ్య కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శుక్రవారం హైదరాబాదులో హైవే అథారిటీ ముఖ్య అధికారి కృష్ణప్రసాద్ తో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ హెచ్ 563 రహదారి నిర్మాణానికి అవసరమైన దాదాపు అన్ని అనుమతులు, రూట్ మ్యాప్, నిధుల మంజూరు పూర్తి కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఎంపి బండి సంజయ్ కుమార్ కృషితో కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి ఇట్టి రహదారి నిర్మాణానికి భారీ నిధులు కేటాయించింది. ఇందులో ముఖ్యంగా కరీంనగర్ – వరంగల్ 68 కి.మి, రూ. 2146.86 కోట్ల నిధులతో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పించింది.
హైవే నిర్మాణ పనులను త్వరితగతిగా ప్రారంభించడానికి ఎంపి బండి సంజయ్ కుమార్ ఎంతో చొరవ చూపించారు. ముఖ్యంగా రహదారి నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ , అనుమతుల కోసం అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, కాంట్రాక్ట్ పనుల కోసం టెండర్లు , నిర్వహించేలా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి రహదారి త్వరితగత నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ కనబరిచి అందుకు తగిన విధంగా చర్యలు తీసుకున్నారు. సమీక్ష సమావేశానంతరం ఎంపి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ హెచ్ 563 రహదారి నిర్మాణ పనులు ప్రారంభించడానికి కావలసిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు.
లోగడ ఇట్టి రహదారి నిర్మాణాన్ని కావలసిన అన్ని అనుమతులు, నిధుల మంజూరు కోసం గతంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పాటు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి ఎన్ హెచ్ 563 రహదారిని అందుబాటులోకి తెచ్చేందుకు తనవంతుగా శక్తివంచన లేకుండా పని చేయడం జరిగిందని చెప్పారు. త్వరలో రహదారి నిర్మాణాల పనులు ప్రారంభమవుతున్న దృశ్య ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా నాణ్యతతో పనులు జరిపించాలని హైవే అథారిటీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపి పలు అంశాలు చర్చించినట్లు ఆయన తెలిపారు.