న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం మరోసారి భారతీయ జనతా పార్టీని విమర్శించారు. పైగా బిజెపిని తన గురువుగా భావిస్తానన్నారు. కాషాయ పార్టీ ఎంతగా తమపై దాడిచేస్తే, అంత బాగా కాంగ్రెస్ దాని భావజాలాన్ని అర్థంచేసుకునేందుకు వీలవుతుందన్నారు. “ బిజెపివారు తీవ్రంగా దాడిచేయాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఆ పార్టీ భావజాలాన్ని కాంగ్రెస్ బాగా అర్థం చేసుకోను వీలవుతుంది. నేను వారిని(బిజెపి) గురువుగా భావిస్తాను. ఏది ఎలా చేయకూడదన్నది వారు నాకు చక్కగా అర్థమయ్యేలా బోధిస్తున్నారు” అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’కు రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందన్నారు. “నేను దానిని (పాదయాత్ర) ఆరంభించినప్పుడు, అది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తీసిన ఓ సామాన్య యాత్ర. కానీ తర్వాత మాకు ఈ యాత్ర ద్వారా ప్రజల గళం, భావాలు అర్థం చేసుకోను వీలయింది” అన్నారు.
‘భారత్ జోడో యాత్ర’ తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయి. మాతో ఇందులో చేరడాన్ని ఎవరినీ అడ్డుకోము. అఖిలేశ్‌జీ, మాయావతిజీ, ఇతరులు ‘ప్రేమపూర్వక భారత దేశాన్ని’(మొహబ్బత్ కా హిందుస్థాన్)కోరుకుంటున్నారు. మా మధ్య ఒకే భావజాల సంబంధం ఉంది” అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు.