Monday, December 23, 2024

పుస్తక మహోత్సవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మహానగరంలో జనవరి ఒకటిన ఒక ప్రదర్శన ముగుస్తుండగా మరో నుమాయిష్ మొదలవుతోంది. తెర పడేది హైదరాబాద్ బుక్‌ఫెయిర్ జాతీయ పుస్తక మహోత్సవం అయితే తెర లేచేది నాంపల్లిలోని పారిశ్రామిక, వస్తు ప్రదర్శన. రెండు ప్రదర్శనల్లో దేని గొప్పదనం దానిదే. మూడు వందలపై స్టాళ్లతో రోజుకు సుమారు ఎనభై వేల మంది సందర్శించిన పుస్తకాల ప్రదర్శన గణాంకాల నిష్పత్తి రీత్యా పెద్ద నుమాయిష్‌కు ఏమి తీసిపోదు.

డిసెంబర్ 22న మొదలై కొత్త సంవత్సరం తొలి రోజుతో ముగుస్తున్న ఈ పుస్తకాల జాతర చేసిన సందడి పుస్తక ప్రియుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. తెలుగులో పుస్తకాల రాక, వాటి అమ్మకాలు, కొని చదివేవాళ్లు అనే అంశాల విషయంలో స్తబ్దంగా, నిరాశాజనకంగా సాగుతున్న కాలంలో ఒక్కసారిగా కట్టు తెగినట్లు పుస్తక ప్రదర్శన సందర్శకులతో కళకళలాడడం చూస్తుంటే తెలుగులోనూ పుస్తకాలు కొనేవారు, చదివేవారు ఉన్నారు అని రుజువవుతున్నట్లు అనిపిస్తుంది. పుస్తక వ్యాపారుల లెక్కలు ఎలా ఉన్నాయో గాని ఈ అక్షర కుంభమేళా మాత్రం కంటికింపుగా, విజయవంతంగానే కనబడుతోంది. పదకొండు రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శన చూడ్డానికి పది రూపాయల టికెట్టు కొని సుమారు పది లక్షల మంది వచ్చారంటే అంతకే సంబరపడిపోవాల్సిందే.

నిజానికి ఈ లెక్క ఇతర భాషల్లో పుస్తకాల అమ్మకాల, చదివేవాళ్ళ లెక్కలకు దేనిలోనూ సరిరావు. పక్కనున్న కన్నడ, తమిళ, మలయాళీ రచయితలు తమ పుస్తకాలను వేల కాపీల్లో ముద్రించి ఏడాది కాలంలో పునర్ముద్రణకు వెళుతుంటే మనం మాత్రం వారి దరిదాపుల్లో కూడా లేము. ఈ పాపం రాసిందల్లా పుస్తకాలుగా తెచ్చే రచయితలదా లేక మంచి పుస్తకాలు వస్తున్నా చదవడం పట్ల ఆసక్తి చూపని తెలుగువారిదా అనేది తేల్చుకోవాలి. పుస్తక ప్రదర్శనలోనో, షాపుల్లోనో నచ్చిన వాటిని కొనుక్కొని చదవాలి తప్ప జనాలకు మరో సదుపాయం లేనందు వల్ల కూడా చదువరుల సంఖ్య తగ్గుతోంది అనుకోవచ్చు. ముప్పయి, నలభై ఏళ్ల క్రితానికి వెళితే ఆ రోజుల్లో చదివేవారికి కోరిన పుస్తకాలు ప్రభుత్వ నిర్వహణలో నడిచే గ్రంథాలయాల్లోనే దొరికేవి. అక్కడే గంటల తరబడి కూచొని చదువుకునేందుకు తగిన సదుపాయాలుండేవి.

ఇప్పటి సీనియర్ సిటిజన్ పుస్తక ప్రియులందరు ఠాగూర్, శరత్, లత, చలం, విశ్వనాథ, రంగనాయకమ్మ రచనలను పైసా ఖర్చు చేయకుండా దర్జాగా కూచొని అక్కడ చదివినవారే. కొని చదవడమనే విధానమే ఉంటే ఆ విలువైన సాహిత్య ప్రయోజనమే చేజారిపోయేది. ప్రభుత్వాలు గ్రంథాలయాలకు తగిన నిధులు మంజూ రు చేయకపోవడంతో చదివే ఆసక్తి ఉన్నవారికి కూడా పుస్తకాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలా తెలుగువారి పుస్తక పఠనం వెనుకబాటులో సర్కారు హస్తం కూడా ఉందనక తప్పదు. గ్రంథాలయాలు కళకళలాడితే చదివేవారి సంఖ్య పెరిగి పుస్తక అమ్మకాలపై కూడా దాని ప్రభావం ఉంటుంది. అయితే ఉన్న తప్పంతా పాలకులపై మోపి, కొని చదివే స్తొమత ఉన్నవారు కూడా జారుకోకూడదు. రోజుకి రూ.లక్షకు కిరాయి తెచ్చి పెట్టే ఎన్టీఆర్ గ్రౌండ్స్‌ని పుస్తక ప్రదర్శనకు ప్రభుత్వం ఉచితంగానే ఈయడం ఓ ప్రోత్సాహమనే అనుకోవాలి.

పుస్తక ప్రదర్శన పండుగలా సాగడానికి, దీని పట్ల ప్రజానీకానికి ఆసక్తి పెరగడానికి బుక్ ఫెయిర్ నిర్వాహకులు కూడా శక్తి మేరకు కృషి చేశారు. ప్రదర్శనకు ముందు నుండే ప్రముఖ రచయితల మాటలతో వీడియో క్లిప్‌లను ప్రచారంలో ఉంచారు. వీరంతా పుస్తక పఠన ప్రాముఖ్యతను పేర్కొంటూ ఈ జాతీయ పుస్తక ప్రదర్శనను విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, జీవితాన్ని, సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి పుస్తక పఠనమే సులువైన మార్గమని సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్ అభిప్రాయపడ్డారు.
పుస్తక ప్రదర్శన ఆరంభం తరవాత కూడా ప్రదర్శనకు వచ్చిన పెద్దల, రాష్ట్ర మంత్రుల, సాహితీవేత్తల నుండి అభిప్రాయ సేకరణ చేసి వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

ఈ వీడియోల్లో బుక్ ఫెయిర్ ప్రారంభ అధ్యక్షులైన గోపాల్ రావు, కార్యదర్శి శృతికాంత్ కూడా పాల్గొన్నారు. 1985లో తాము వేసిన బీజం పెద్ద వటవృక్షంలా విస్తరించి 35వ ప్రదర్శన దాకా ఎదగడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని తమ ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ పదకొండు రోజుల పాటు దినపత్రికల్లో పుస్తక ప్రదర్శన వార్తలు విపులంగా, సచిత్రంగా వచ్చేలా చూశారు. రోజువారీగా ప్రదర్శనలోని విశేషాలు, సందర్శకుల, జరిగిన సమావేశాల వివరాలు క్రమం తప్పకుండా ప్రముఖ వార్తలుగా పత్రికల్లో వచ్చాయి. పుస్తక ప్రదర్శన కవరేజిపై తెలుగు దిన పత్రికలు ప్రత్యేక శ్రద్ధ, ఆసక్తులు చూపించాయనవచ్చు. ఈసారి ఫెస్ బుక్ కూడా పుస్తక ప్రదర్శన ప్రచారంలో ప్రముఖ పాత్ర పోషించిందనవచ్చు.

స్టాళ్ల నిర్వాహకులు తమ వద్దకు వచ్చిన రచయితలు, ప్రజా నేతలు, సినిమా వాళ్లతో పుస్తకాలు చేత బట్టుకొని ఫోటోలు, వీడియోలు తీసుకోని తన ఫెస్ బుక్‌లో ఎక్కించారు. సందర్శకులు కూడా ఫోటోలు, సెల్ఫీలు దిగి మిత్రులతో పంచుకున్నారు. ఇలాంటి కొత్త తరం ప్రచారాలు మరికొందరు ప్రదర్శనకు వచ్చేలా పనికొచ్చాయి అనుకోవచ్చు. కొందరు కార్టూనిస్టులు కూడా ప్రదర్శనపై తమ కుంచెను పని చెప్పారు. కార్టూనిస్ట్ సరసి దాదాపు రోజుకొక్క కార్టూన్ తన ఫెస్ బుక్‌లో ఉంచారు. కాగితం మీది నుంచి అక్షరం డిజిటల్ తెరపైకి మారుతున్న క్రమంలో, మొబైల్ ఫోన్లలో ఇంటర్ నెట్ ఆధారిత సేవల్లో ఈ పుస్తకాల సౌలభ్యం వల్ల యువత పఠనానికి అరచేతిలో ఫోను వైపు వెళుతున్న తరుణంలో కొత్త సాహిత్య యాప్‌లను ఆవిష్కరింపక తప్పదు. ఇప్పటికే ఆ దిశగా కొన్ని యాప్‌లు ఉండగా పుస్తక ప్రదర్శన సందర్భంగా ‘చదువు’ అనే పుస్తకాల అప్లికేషన్ పుట్టుకొచ్చింది. సందర్శకుల్లో ఆసక్తిపరులు ఆ యాప్‌కు చందాదారులుగా మారారు.

ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్‌కు బుక్ ఫెయిర్ పెద్ద పీట వేసింది. అన్ని రకాల కార్యక్రమాలు జరిగే వేదికకు ఆయన పేరు పెట్టింది. వేదికపై ఆయన చిత్రంతో పాటు ‘అలిశెట్టి ప్రభాకర్ వేదిక’ అనే పెద్ద అక్షరాల బ్యానర్ అందరినీ ఆకట్టుకొంది. మరో వైపు మైదానం మధ్యలో అలిశెట్టి ఫోటోతో పాటు ఆయన కవిత పంక్తితో కూడిన పెద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆయనపై అభిమానంతో చాలా మంది ఆ ఫ్లెక్సీ వద్ద ఫోటోలు దిగడం కనిపించింది. ప్రదర్శన కోసం కొత్త పుస్తకాలు ప్రచురించినవారిలో యువ రచయితలే ఎక్కువగా ఉన్నారు. వీరు స్టాళ్లలోకి సందర్శకులను గౌరవంగా ఆహ్వానించి, స్నేహ పూర్వకంగా పలకరించి, వారితో ఫోటోలు దిగి తమ కొత్త పుస్తకాలు అమ్మకాలకు కొత్త పంథాలను తొక్కారు. వీరి సందడి ప్రదర్శనకు నవోత్సాహాన్ని అందించింది. సందర్శించిన వారికి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలే ఈ జాతీయ పుస్తక మహోత్సవం ఏటా ఇలాంటి సందడే చేసి పుస్తకానికి ఊతంగా నిలవాలి.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News