బీజింగ్: చైనాలో జీరో కొవిడ్ పాలసీ ఎత్తివేసిన దగ్గర నుంచి రోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ వేల సంఖ్యలో మరణాలు సంభిస్తున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఎయిర్ఫినిటీ అనే పరిశోధన సంస్థ చైనాలో రోజుకు సుమారు 9 వేల మంది కొవిడ్‌తో మరణిస్తున్నారని తన నివేదికలో పేర్కొంది.
కరోనా ఆంక్షలు ఎత్తివేయక ముందు నుంచి కొన్ని ప్రావిన్స్‌ల్లో కరోనా తీవ్రతను రికార్డు చేస్తున్నట్టు వెల్లడించింది. ఒక్క డిసెంబర్ నెలలో కోటి 86 లక్షల కేసులు నమోదయ్యాయని తెలియజేసింది. వారిలో సుమారు లక్షమంది మరణించి ఉంటారని అంచనా వేసింది. జనవరి మధ్యనాటికి రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. నెలాఖరుకు వైరస్ వల్ల 5,84,000 మంది చనిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది.
అయితే డిసెంబర్ 30న దేశంలో ఒక్కరు మాత్రమే మరణించారని చైనా ప్రభుత్వం ప్రకటించడం విశేషం. కొవిడ్ డేటాపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికారులతో చైనా అధికారులు వర్చువల్‌గా సమావేశమై కొవిడ్ పరిస్థితిపై చర్చించారు. ఈ సందర్భంగా చైనా దేశంలో కొవిడ్ పరిస్థితులపై నిర్దిష్టమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనా ప్రభుత్వాన్ని కోరింది.
జెనెటిక్ సీక్వెన్సింగ్, ఆస్పత్రుల్లో చేరిన వారి వివరాలు, మరణాలు, వాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం పూర్తిగా తెలియజేయాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ చైనా అధికార యంత్రాంగాన్ని కోరింది. చైనా నుంచి వచ్చే వారిపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నా చైనా నుంచి మాత్రం పారదర్శకమైన శాస్త్రీయమైన సమాచారం కోరవలసి వస్తోంది. చైనా నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని చాలా దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. కెనడా, మొరాకో దేశాలు కూడా ఈ దేశాల జాబితాలో చేరాయి.