Monday, December 23, 2024

అనుసృష్టి అద్భుతం

- Advertisement -
- Advertisement -

అనిల్ బత్తుల దేశదేశాల కవిత్వం..

తెలుగు రాష్ట్రాలలో అనువాదాలకు ఆదరణ లేదు. ఇది జగమెరిగిన సత్యం.ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలియదు. బహుశా అక్కడ కూడా అది మన రాష్ట్రంలో లాగే ఉండొచ్చు. ప్రపంచీకరణ ఉధృతంగా ఉన్న ఈ కాలంలో అనువాదాలు విస్తృతంగా జరగాలి. కానీ అవి ఆ స్థాయిలో జరగడం లేదు. ఒక భాషను మాట్లాడే ప్రజలకు ప్రపంచంలోని వివిధ దేశాల సాహిత్యం విరివిగా అందకపోతే, ఆ భాషాసాహిత్యం ఎలా వికసించి ముందడుగు వేస్తుంది? తెలుగు సాహిత్యరంగంలో ఇట్లాంటి నిరుత్సాహకర పరిస్థితి ఉన్న సమయంలో అనిల్ బత్తుల ఇటీవలే దేశదేశాల కవిత్వ అనువాదాన్ని సంకలించి,479పేజీల పెద్ద గ్రంథాన్ని ప్రచురించడం గొప్ప విషయం. అందుకు ఆయనను ఎంతగా అభినందించినా తక్కువే.అసలు ఈ పని చేయాల్సింది సాహిత్య అకాడమీలు, విశ్వవిద్యాలయాలు మొదలైన సంస్థలు. ప్రైవేటు వ్యక్తులతో పోలిస్తే వాటికి వనరులు ఎక్కువగా ఉంటాయి. ఐనా అవి ఆ పని ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించుకున్నప్పుడువచ్చే జవాబు దిగులును కలిగిస్తుంది.

ముఖచిత్రం విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నట్టు తెలిసిపోతూనే ఉంది. మోషే దయాన్,బంగారు బ్రహ్మంలు కలిసి అద్భుతమైన ముఖచిత్రాన్ని అందించారు.వారిఅమోఘమైన ప్రతిభకు నమస్కరించాలి. ఈ పుస్తకంలో 158మంది అనువాదకులు తర్జుమా చేసిన 207గురు కవుల 281 అనువాదాలున్నాయి. సంపాదకుడుగా వ్యవహరించిన అనిల్ బత్తుల తన పనికి చాలా వరకు న్యాయం చేశారు. ఆధునిక కవిత్వాన్ని మాత్ర మే తర్జుమా కోసం ఎంచుకోవడం మంచి విషయమే. కేదార్ నాథ్ సింగ్, ఖలీల్ జిబ్రాన్, ఎ. కె.రామానుజన్, పాబ్లో నెరూడా, అయ్యప్ప పణిక్కర్, రవీంద్ర నాథ్ టాగోర్, రూమీ మొదలైన కవుల తర్జుమా కవితలు ఎక్కువగా ఉన్నాయి ఈ పుస్తకంలో. వీరందరూ ఆగౌరవానికి అర్హులే. ఇందులోని కొన్ని కవితలు చాలా దీర్ఘంగా ఉన్నాయి.

అటువంటి కవితలలో చదివించే గుణం తక్కువగా ఉండటం తరచుగా జరిగే విషయం. ఎందుకంటే వాటిని తర్జుమా చేసేటప్పుడు అనువాదంలో బిగి తగ్గే అవకాశముంది. కానీ దేవీప్రసాద్ మిశ్ర కవితకు ఎన్. వేణుగోపాల్ చేసిన అనువాదం ‘ముసల్మాన్’ చివిరిదాకా చదివించింది. అయితే పెద్ద(పొడవైన) కవితలన్నీ అలా లేవు.దానికి కారణం అనువాదంలో లోపం అని కాదు. ఎంత జాగ్రత్తగా అనువదించినా మూలకవిత నిడివి ఎక్కువగా ఉండటం ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశముంది. చాలా అరుదుగా మాత్రమేదీనికి విరుద్ధంగా జరుగుతుంది.కవితను మొత్తం చదివింతర్వాత బాగున్నట్టు అనిపించడం కాకుండా, చదువుతున్నంతసేపు బాగున్నట్టనిపిస్తేనే పాఠకుడు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తాడు.

కొన్నైతే అద్భుతమైన కవితలున్నాయి ఈ పుస్తకంలో. కె. సచ్చిదానందన్ కవిత రుంజ ఒక ఉదాహరణ.రుంజ శబ్దం/ బయట నుంచా/ లోన నుంచా/ తెలుసుకోవడానికి/ రహస్యంగా చర్మాన్ని విప్పాను/ తొంగిచూశాను లోనికి/ ముందు చూసాను అడవి/ ఆపై అడవిలో గర్జించే మృగాలని/ ఎడతెరిపి లేని వాన/ కట్టలు తెగి ప్రవహించే నదులు/ వేగం పుంజుకునే గాలి/ చీకటి గగనమంతా నిండుతూనే వుంది/ కొండవాళ్ల వేషంలోని దేవుడొక్కడు/ తిరుగుతూనే వున్నాడు, అడవి గేదె పైన/ చేతులు వణికాయి/ చర్మాన్ని మళ్లీ కట్టాను. మనిషిలోని అంతర్గత విధ్వంసాన్ని, అల్లకల్లోలాన్ని అద్భుతంగా చిత్రించాడు కవి. ఎల్. ఆర్. స్వామి అనువాదం బాగుంది. కేదార్ నాథ్ సింగ్ కవిత,‘గింజలు’కూడా బాగుంది. ఇంకా గోదావరి శర్మ అనువదించిన ఎరికా జోంగ్, వాస్కో పోపాల కవితలు, చలం అనువదించిన ఉమర్ ఖయ్యాం రుబాయీ, నలిమెల భాస్కర్ తర్జుమా చేసిన రాజమురుగు పాండియన్ కవిత, యాకూబ్ అనువదించిన అయ్యప్ప పణిక్కర్ కవితచెప్పుకోతగినవి.

స్త్మ్రల్ అనువదించిన హర్భజన్‌సింగ్ కవిత చాలా సాంద్రంగాఉంది. అం గళ్ళు, వయసు అనే శంఖ ఘో ష్ కవితలైతే అద్భుతం. వీటిని వరుసగా అనిల్ బత్తుల, దేశరాజు అనువదించారు. ఇవి మూలంలోనే చాలా బలమైనవి కావడం వల్లనే వాటి గొప్పతనం అనువాదంలో ప్రతిఫలించిందని అనుకోవచ్చు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ పుస్తకంలోనివి ఏ మూలభాషల (source languages) లోని కవితలకు అనువాదాలో తెలియదు. మచ్చుకు నివాసం అనే కవిత శీర్షిక కింద కోసూరి శైలి, భారతదేశం (తెలంగాణ), అను: అనంతు చింతలపల్లిఅని వుంది. తెలంగాణ ప్రజల మాతృభాష తెలుగు. తెలుగులోంచి తెలుగులోకి తర్జుమా అనే ప్రశ్నే రాదు.

మరి మూలాన్ని ఆమె హిందీలో రాసిందా, ఉర్దూలో రాసిందా, లేక ఇంగ్లిష్ లో రాసిందా? తర్వాతి ముద్రణలో ఈ అనిశ్చితిని తొలగిస్తే బాగుంటుంది.సంపాదకునికి ప్రోజ్ పొయెం అంటే ఇష్టం లేనట్టుంది. మొత్తం మీద ఇదొక గొప్ప ప్రయత్నం.అనిల్ బత్తుల ఎందరో కవులకు ఆదర్శంగా నిలిచాడనడంలో సందేహం లేదు. ముందు ముందు కూడా ఇటువంటివి మరికొన్ని తీసుకొస్తాడని, తీసుకురావడంలో ఇతరులకు మార్గనిర్దేశనం, సహాయ సహకారాలు అందిస్తాడని ఆశిద్దాం.

ఎలనాగ
98669 45424

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News