Saturday, November 23, 2024

కుర్రాళ్లకు పరీక్ష.. నేడు లంకతో తొలి టి20

- Advertisement -
- Advertisement -

ముంబై: కొత్త సంవత్సరంలో టీమిండియా తొలి సిరీస్‌కు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు మంగళవారం తెరలేవనుంది. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో భారత్ బరిలోకి దిగనుంది. టి20 ఫార్మాట్‌కు కొత్త సారథిగా ఎంపికైన హార్దిక్ పాండ్యకు లంకతో పోరు కీలకంగా మారింది. హార్దిక్ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టు లంకతో అమీతుమీ తేల్చుకోనుంది. విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, షమి, సిరాజ్, భువనేశ్వర్ వంటి సీనియర్ క్రికెటర్లు సిరీస్‌కు దూరమయ్యారు. ఇక శ్రీలంకతో పూర్తి స్థాయి జట్టులో బరిలోకి దిగుతోంది. ఇటీవల కాలంలో శ్రీలంక టి20 ఫార్మాట్‌లో నిలకడైన విజయాలు సాధిస్తోంది. భారత్‌తో జరిగే సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
యువ ఆటగాళ్లకు మంచి ఛాన్స్
సీనియర్ క్రికెటర్లకు విశ్రాంతి ఇవ్వడంతో యువ ఆటగాళ్లకు సిరీస్‌లో చోటు దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కుర్రాళ్లపై ఉంది. ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, దీపక్ హుడాలకు సిరీస్ చాలా కీలకమని చెప్పాలి. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు శాశ్వతం చేసుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోక తప్పదు. వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్‌కప్ నాటికి బలమైన జట్టును తయారు చేయాలనే ఉద్దేశంతో బిసిసిఐ పలు సిరీస్‌లలో యువ ఆటగాళ్లకే ఛాన్స్ ఇస్తోంది. కొంత మంది క్రికెటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, దీక్ హుడా, అర్ష్‌దీప్‌లు తమకు లభించిన ఛాన్స్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఇక ఈ సిరీస్‌లో ముకేశ్ కుమార్, రాహుల్ త్రిపాఠి, శుభ్‌మన్ గిల్, ఉమ్రాన్ మాలిక్‌లకు కూడా ఛాన్స్ లభించింది. వీరు దీన్ని ఎంత వరకు తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతారో వేచి చూడాల్సిందే.
అందరికళ్లు హార్దిక్‌పైనే
మరోవైపు టి20 ఫార్మాట్ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే ఐపిఎల్‌లో సారథిగా తానెంటో హార్దిక్ నిరూపించుకున్నాడు. అసాధారణ కెప్టెన్సీతో అరంగేట్రం టోర్నీలోనే గుజరాత్ టైటాన్స్‌ను ఐపిఎల్ విజేతగా నిలిపాడు. దీంతో హార్దిక్‌కు తక్కువ వ్యవధిలోనే టీమిండియాకు సారథ్యం వహించే అరుదైన ఛాన్స్ లభించింది. దీన్ని హార్దిక్ ఎలా ఉపయోగించుకుంటాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టి20 సిరీస్‌లో సారథిగా సక్సెస్ అయితే భవిష్యత్తులో వన్డేలోనూ అతనికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఇలాంటి స్థితిలో హార్దిక్‌పై బాగానే ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకుని అతను జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడనేది అంతుబట్టని విషయంగా మారింది. అయితే ఎటువంటి పరిస్థితిని అయినా తట్టుకుని జట్టును ముందుకు నడిపించే సత్తా హార్దిక్‌కు ఉంది. దీంతో అతనిపై బిసిసిఐ పెద్ద నమ్మకాన్నే పెట్టుకుంది. ఇందులో అతను ఎంతవరకు సఫలమవుతాడనేది సిరీస్ ద్వారా తేలిపోనుంది.
తక్కువ అంచనా వేయలేం
కాగా, శ్రీలంక జట్టును కూడా తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు లంకలో కొదవలేదు. పాథుమ్ నిసాంకా, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, కెప్టెన్ దాసున్ శనక, వనిందు హసరంగా, మహీశ్ తీక్షణ తదితరులతో లంక పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌కు సిరీస్‌లో లంకతో గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News