న్యూఢిల్లీ : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోపన్యాసం చేస్తారు. గత ఏడాది జులైలో అత్యున్నత పదవిని అలంకరించిన తరువాత రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే మొదటి ప్రసంగం ఇదే అవుతుంది. ఆ తరువాత పార్లమెంట్‌లో ప్రభుత్వం ఆర్థిక సర్వేను ప్రవేశ పెడుతుంది. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడతారు. ఇప్పటికే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల పూర్తి అజెండా పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి చేరినట్టు తెలుస్తోంది. ఈసారి కూడా ఈ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. తొలి విడతలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10 వరకు , రెండో విడతలో మార్చి 6 నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 6 న ముగియనున్నాయి. తొలివిడతలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, వార్షిక బడ్జెట్‌పై చర్చ కొనసాగుతుంది. బడ్జెట్‌పై జరిగే చర్చలకు ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు.
వివిధ మంత్రిత్వశాఖల కేటాయింపు డిమాండ్లను స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ సెషన్ విరామ కాలంలో పరిశీలించిన తరువాత రెండో విడత సమావేశాలు మార్జి 6 న ప్రారంభమై, ఏప్రిల్ 6న ముగుస్తాయి. రెండో విడత సమావేశాల్లో వివిధ మంత్రిత్వశాఖలకు నిధుల కేటాయింపులపై చర్చించడం, బడ్జెట్‌కు ఆమోదం తదితర అంశాలపై చర్చిస్తారు. సెంట్రల్ విస్టా అభివృద్ధిలో భాగంగా కొత్త పార్లమెంట్ భవనం పనులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలో నిర్వహిస్తారని దృఢ నమ్మకంతో ఉన్నారు. గత సమావేశాల్లో లోక్‌సభలో తొమ్మిది బిల్లులను ప్రవేశ పెట్టగా, ఏడు బిల్లులు ఆమోదం పొందాయి. రాజ్యసభలో తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ఉభయ సభల్లోను మొత్తం తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి.