కరీంనగర్ : కరీంనగర్ పట్టణం తీగలగుట్టపల్లి వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ ప్రాంత ఎంపి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆర్‌ఓబి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకదృష్టి సారించి, అందుకు తగిన ప్రయత్నాలు చేశారు. తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎంపి పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేశారు. ఎంపి బండి విజ్ఞప్తులకు స్పందించిన కేంద్రప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వాటా భాగస్వామ్యంతో తీగలగుట్టపల్లి ప్రాంతంలో రూ.100 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి అనుమతులను మంజూరు చేసింది.
ఆర్‌ఓబి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను గత ఏడాది మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో, ఆర్‌ఓబి అంచనా వ్యయం 154.74కోట్లకు పెరిగింది. తీగలగుట్టపల్లి ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో అనునిత్యం ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వ సేతు బంధన్ నిధులతో తీగలగుట్టపల్లి ఆర్‌ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా బుధవారం బిజెపి శ్రేణులు కరీంనగర్‌లో సంబరాలు చేశారు.