పుణె: ఉత్కంఠభరితంగా సాగిన తొలి టి20లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా గురువారం శ్రీలంకతో జరిగే రెండో మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో హార్దిక్ సేన బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. కిందటి మ్యాచ్‌లో విజయం కోసం చివరి వరకు సర్వం ఒడ్డి పోరాడిన లంక కేవలం రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. రెండు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో ఈ మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగడం ఖాయం.
బ్యాటింగే అసలు సమస్య..
ఇక టీమిండియాను బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. తొలి టి20లో కీలక ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ తదితరులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ వైఫల్యం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా టాపార్డర్ రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్‌లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. రానున్న రోజుల్లో జట్టులో స్థానాన్ని కాపాడుకోవాలంటే వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో రాణించక తప్పదు. సంజు శాంసన్‌కు ఈ పోరు సవాల్‌గా తయారైంది. ఇందులో విఫలమైతే జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి స్థితిలో సంజు శాంసన్ ఎలా ఆడుతాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
మరోవైపు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న సూర్యకుమార్ విజృంభిస్తే టీమిండియాకు భారీ స్కోరు ఖాయం. గిల్ కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సి ఉంటుంది. కాగా, తొలి మ్యాచ్‌లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన దీపక్ హుడా, అక్షర్ పటేల్‌లు ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారారు. ఇక ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా తొలి ట20లో బాగానే ఆడాడు. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై ఆశలు పెట్టుకుంది. బౌలింగ్‌లో యువ బౌలర్లు శివం మావి, ఉమ్రాన్ మాలిక్‌లు అద్భుతంగా రాణించారు. హార్దిక్ వికెట్లు తీయకున్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే హర్షల్ పటేల్, చాహల్‌లు విఫలం కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
ప్రతీకారం కోసం
మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. లంక జట్టును కూడా బ్యాటింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు విఫలం కావడంతో మొదటి టి20లో లంకకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం అలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని లంక భావిస్తోంది. కెప్టెన్ దాసున్ శనక, హసరంగ, కరుణరత్నె, కుశాల్ మెండిస్, ధనంజయ డిసిల్వా, రాజపక్స, అసలంక తదితరులతో లంక చాలా బలంగా ఉంది. సమష్టిగా రాణిస్తే ఈ మ్యాచ్‌లో గెలవడం లంకకు కష్టమేమీ కాదు.