జోషిమత్: ఉత్తరాఖండ్‌లోని పుణ్యక్షేత్రం జోషిమత్ క్రమేపీ మునిగిపోతోంది. ఈ పర్వత ప్రాంతపు రాష్ట్రంలో వరుసగా కొండచరియలు విరిగిపడటం, వరదలతో ఈ పరిణామం సంభవించింది. ఇప్పటికే ఇక్కడ వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది ఈ పట్టణం క్రమేపీ నేలలోకి కూరుకుపోవడానికి ముందస్తు సంకేతంగా నిలిచిందని నిపుణులు తెలిపారు. ఇక ముందు నామరూపాలు లేకుండా పొయ్యే ఈ పట్టణాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సందర్శిస్తారు. ఇక్కడ పరిస్థితిని నివారించేందుకు అవసరం అయిన సిఎం ఇప్పటికే నిపుణుల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు.
ఈ పట్టణం ఇక లేకుండా పోతుందని తెలియడంతో దాదాపు వంద కుటుంబాలు చేసేది లేక దూర ప్రాంతాలకు తరలివెళ్లారు. పూర్తిగా కూరుకుపొయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలకు చెందిన 23 ఇళ్లను గుర్తించి ఈ కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అయితే ఇళ్లు వదిలిపెట్టడానికి ఇష్టపడని వారు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలా మంది ఇళ్లు ఖాళీ చేసి ఎముకలు కొరికే చలిలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అధికార యంత్రాంగం స్పందన కోసం చూస్తున్నారు. 3000కు పైగా జనం బాధితులు అయ్యారని మున్సిపల్ అధికారి తెలిపారు. తాము ఇప్పటికే అన్ని ఇళ్ల సర్వే చేపట్టినట్లు, అయితే చాలా ఇళ్లకు తాళం వేసి జనం దూర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు గుర్తించామని వివరించారు. ఐఐటి రూర్కేకు చెందిన నిపుణుల బృందాలు పలు సార్లు ఈ పట్టణంలో తనిఖీలు జరిపాయి.
పలు రోడ్లకు కూడా పగుళ్లు ఏర్పడటం కొన్ని చోట్ల లోతైన బిలాలు పడటం వీరు గుర్తించారు. వీటిని పరిశీలించి తమ నివేదికను సిఎంకు సమర్పించేందుకు సిద్ధం అయ్యారు. ఈ పట్టణంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఉబికి వస్తున్నాయి. ప్రత్యేకించి భూకంపాల ప్రభావిత ప్రాంతాలలో ఈ జలపాతం వంటి పరిస్థితి ఏర్పడింది. తన ఇళ్లు ఇక్కడ ఏర్పడ్డ పగుళ్లతో దాదాపు శిథిలం అయిందని, అయితే తాను వేరే చోటికి వెళ్లలేనని ఇక్కడే పుట్టిన తాను తన కుటుంబం ఏది ఏమైనా ఇక్కడనే జీవించి ఇక్కడే మరణించాలని స్థానిక మాజీ మున్సిపల్ ఛైర్మన్ మాధవి సతీ తెలిపారు. ఈ పట్టణం పూర్తిగా పర్వత ప్రాంతాల మధ్యలో ఉంది. పలువురు పర్వాతారోహకులు తమ సాహసయాత్రకు దీనిని ముఖద్వారంగా ఎంచుకుని ముందుకు సాగుతారు.