Sunday, November 17, 2024

కామారెడ్డి బంద్ ప్రశాంతం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ మార్పు కోరుతూ రైతు జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. నూతన మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా గురువారం రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసిన నేపథ్యంలో ఎనిమిది గ్రామాలకు చెందిన రైతులు, రైతు జెఎసి, వివిధ పార్టీల నేతలు ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం నుంచి అఖిలపక్ష నాయకులు బస్సులను అడ్డుకోవడాని ప్రయత్నించగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ నిలుపుదల చేసి వివిధ పోలీస్టేషన్లకు తరలించారు. అలాగే ముందస్తుగా బిజెపి నేత వెంకటరమణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి రాజంపేట్ పోలీస్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నా యకులు కైలాష్ శ్రీనివాస్ రావుతో కలసి కలెక్టర్‌కు వినతిపత్ర ం అందజేశారు.

కొత్త మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ను వివిధ పార్టీల నేతలు కోరారు. బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెలే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ర్యాలీలకు యత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది గ్రామాల నుంచి రైతులు జిల్లా కేంద్రానికి తరలివచ్చే క్రమంలో వారిని రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలో వాణిజ్య, వ్యాపార సముదాయాలు మూసేసి స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

రైతులు ఆందోళన చెందొద్దు ఏ ఒక్క రైతుకు నష్టం జరగదు
బిఆర్‌ఎస్ సీనియర్ నేత నిట్టు వేణుగోపాల్ రావు

కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్ ప్లాన్ విషయంలో పలు రాజకీయ పార్టీలు చేస్తున్న హడావిడితో రైతులు అయోమయంలో పడొద్దని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాల్ రావు అన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ఫైనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌పై వేణుగోపాల రావు అర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. నెల రోజులుగా కామారెడ్డిలో కొన్ని రాజకీయ పార్టీలు రైతులను అయోమయానికి గురిచేస్తున్నాయని, రైతులెవరూ అధైర్య పడవద్దన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు కొత్త మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం కామారెడ్డితోనూ మాస్టర్‌ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు.

అందుకు సంబంధించిన ప్లెక్సీలు పట్టణంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కామారెడ్డి పట్టణ మధ్య తరగతి మాస్టర్ ప్లాన్ తయారు చేసిన ముసాయిదా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ఇందులో అభ్యంతరాలకు నవంబర్ 13 నుంచి జనవరి 11 వరకు 60 రోజులు సమయం ఇవ్వడం జరిగిందని, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రైతులకు ఒక్క గుంట కూడా నష్టం జరగకుండా ఫైనల్‌చేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయని, వాటిని ఈనెల 11 తర్వాత పరిశీలిస్తామన్నారు. ఈ విషయంపై గురువారం మంత్రి కెటిఆర్ సైతం తగిన సూచనలు చేశారని తెలిపారు. పలు రాజకీయ పార్టీలు చేస్తున్న కుతంత్రాలకు రైతులు బలికావద్దని, రాజకీయ పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయంలో పడేస్తున్నాయన్నారు. మాస్టర్ ప్లాన్ అమలుకు రైతులు కూడా కామారెడ్డి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియా, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటి, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News