పానీపట్(హర్యానా): అయోధ్యలో రామాలయం 2024 జనవరి 1న ప్రారంభమవుతుందని అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపురలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. ఆలయంపై ప్రకటన చేయడానికి మీరేం ఆ ఆలయ పూజారా లేక మహంతా అని అమిత్ షాను ఖర్గే ప్రశ్నించారు. దేవుడి పట్ల ప్రతి ఒక్కరికీ భక్తి ఉంటుందని, కాని త్రిపురలో ఎన్నికలు జరగనున్న సందర్భంలో అమిత్ షా ఆ ప్రకటన ఏ హోదాలో చేస్తారని ఖర్గే నిలదీశారు.
2024 మేలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా జనవరి 1న అయోధ్య ఆలయం ప్రారంభమవుతుందని ఆయన ఎలా ప్రకటిస్తారని ఖర్గే ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం గురించి ఆ గుడి పూజారులో, మహంతో ప్రకటిస్తారని, మీరు ఒక రాజకీయ నాయకుడు మాత్రమేనని, హోం మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీరు దేశ అంతర్గత భద్రత గురించి, శౠంతి భద్రతల గురించి మాత్రమే ఆలోచించాలంటూ అమిత్ షాకు ఖర్గే చురకలు అంంటించారు. రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్ర శుక్రవారం హర్యానాలోని పానీపట్‌లోకి ప్రవేశించిన సందర్భంగా ఖర్గే ప్రసంగించారు.