ముంబై: ఢిల్లీలో 20 ఏళ్ల అంజలిని కారుతో ఢీకొట్టి… 12 కిమీ. వరకు లాక్కెళ్లి పడేసిన ఉదంతం అందిరికీ తెలిసిందే. ఆమె మరణంతో ఆమె కుటుంబం దిక్కులేనిదయింది. ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో అంజలి పనిచేస్తుండేది. ఆమే కుటుంబానికి పెద్ద దిక్కు. మాకందిన సమాచారం ప్రకారం అంజలి కుటుంబానికి ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్‌కు చెందిన ఎన్జీవో సంస్థ సాయం అందించింది. కష్ట కాలం నుంచి ఆ కుటుంబం బయటపడేందుకు కావలసినంత ఇచ్చారని తెలిసిందే తప్ప, ఎంత అన్నది తెలియలేదు. షారూఖ్ ఖాన్‌కు చెందిన ‘మీర్ ఫౌండేషన్’ ఈ సాయం అందించిందని సమాచారం. ముఖ్యంగా అంజలి తల్లి ఆరోగ్య చికిత్సకు, ఆమె తోడబుట్టిన వారికి ఉపశమనం కలిగించేలా ఆ సాయం ఉందని తెలిసింది.
తన తండ్రి మీర్ తాజ్ ముహమ్మద్ ఖాన్ పేరిట షారూఖ్ ఖాన్ ఈ ‘మీర్ ఫౌండేషన్’ ఏర్పాటు చేశారు. మీర్ ఫౌండేషన్ అనేక మందిని వేర్వేరు పరిస్థితుల్లో, అవసరాల్లో ఆదుకుంటూ వస్తోంది. ముఖ్యంగా ఏ దిక్కుదివాణంలేని మహిళలు, పిల్లలకు ఈ సాయం అందిస్తోంది. షారూఖ్ ఖాన్ ‘పఠాన్ చిత్రం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కానీ ఆ సినిమా కొంత వరకు సెంటిమెంట్ల వివాదంలో చిక్కుకుంది. ఇదిలావుండగా అంజలిని కారుతో ఢీకొట్టి 12 కిమీ. కారుతోనే ఈడ్చుకెళ్లి చంపిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిర్లక్ష్యంగా, కుట్రపూరితంగా వ్యవహరించినందుకు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని వైద్య పరీక్షల కోసం గురువారం సంజయ్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిసింది.