లక్నో : స్కూలు విద్యార్థిని ఒక కారు ఢీకొట్టింది. విద్యార్థి కాలు వెనుక చక్రం వద్ద ఇరుక్కోవడంతో కిలోమీటరు దూరం వరకు కారు ఈడ్చుకెళ్లింది. గమనించిన స్థానికులు కారు ఆపాలని డ్రైవర్‌కు చెప్పినా అతడు పట్టించుకోలేదు. చివరకు రద్దీ ప్రాంతంలో ఆ కారును జనం అడ్డుకుని విద్యార్థిని కాపాడారు. 15 ఏళ్ల బాలుడ్ని ఢీకొట్టి ఆపకుండా కారుతో ఈడ్చుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను చితక్కొట్టారు. ఆ కారును ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్‌లో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది.9 వ తరగతి చదువుతున్న కేతన్‌కుమార్ సైకిల్‌పై ట్యూషన్‌కు వెళ్తుండగా తెల్లని వ్యాగనార్ అతడి సైకిల్‌పై నుంచి దూసుకెళ్లింది.
విద్యార్థి కాలు కారు వెనుక చక్ర భాగంలో ఇరుక్కుంది. డ్రైవర్ కారును ఆపకుండా తప్పించుకు పోయాడు. స్థానికులు కారును ఆపాలని కేకలు వేసి దాని వెంట పడ్డారు. చివరకు జనం రద్దీగా ఉన్నచోట కారును కొందరు అడ్డుకున్నారు. డ్రైవర్‌ను కర్రలతో చితక్కొట్టారు. కారును ధ్వంసం చేశారు. అక్కడకు పోలీసులు చేరుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గాయపడిన విద్యార్థి కేతన్‌కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ తరహాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.