Friday, November 22, 2024

ఎగిసిపడుతున్న ఎర్ర బంగారం ధరలు.. రూ.80వేలు దాటి..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : సీజన్ ప్రాంరభంలోనే ఎర్రబంగారం ధరలు ఎగిసి పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎండు మిర్చికి భారీగా డిమాండ్ ఏర్పడింది. క్వింటాలు ఎండుమిరప దేశవాళీ రకం రూ.80వేల మార్కు దాటేసింది. వరంగల్ మార్కెట్‌లో క్వింటాలు ధర రూ.80100కు చేరి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయంగా మనదేశం ఎండు మిరప సాగు, ఉత్పత్తిలో అగ్ర స్థానంలో ఉండగా , జాతీయంగా ఎండుమిరప సాగు చేస్తున్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రధమ స్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండించిన ఎండు మిరప నాణ్యతపరంగా ఉత్తమ లక్షణాలు కలిగిఉండటంతో ఆంతర్జాతీయ మార్కెట్లో ఈ ప్రాంత మిరప హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

పెరుగుతున్న ధరలను చూసి రైతులు పెద్ద ఎత్తన ఎండు మిరప మార్కెట్లకు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది అధికవర్షాలు , చీడ పీడల సమస్యలు మిరప పంట దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లకు సరుకు రావటం లేదు. మరోవైపు అంతర్జాతీయంగా మిరపకు డిమాండ్ పెరుగూతూ పోతోంది. ప్రపంచ వ్యాప్తంగా మిరప పంటలో 25శాతం పంట మనదేశంలోనే ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడ పండించిన పంట ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి జరుగుతోంది. మనదేశంనుంచి ఏటా 14లక్షల మెట్రిక్‌టన్నుల ఎండు మిరప వివిధ దేశాలకు ఎగుమతి అవుతుండగా , చైనా నుంచి 4.5లక్షల టన్నులు, మెక్సికో నుంచి 4లక్షల మెట్రిక్ టన్నులు, పాకిస్తాన్ నుంచి 3.5లక్షల మెట్రిక్ టన్నుల సరుకు వివిధ దేశాలకు ఎగుమతి జరుగుతున్నట్టు సుగంధ ద్రవ్యపంటల బోర్డు అధికారులు వెల్లడించారు.

మిరప ఉత్పత్తులకు కేరాఫ్‌గా తెలుగు రాష్ట్రాలు

దేశంలో మిరప పంట సాగు, ఉత్పత్తికి తెలుగు రాష్ట్రాలు కేరాఫ్‌గా నిలిచాయి. దేశంలో పండిస్తున్న మిరప పంటలో 26శాతం ఈ రెండు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం గత ఏడాది మిపర సాగులో జాతీయంగా నాలుగవ స్థానంలో నిలిచింది. 2.23లక్షల ఎకరాల్లో మిరప సాగు చేసి 5.45లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించింది.గత ఏడాది కూడా ఎండు మిరప ధరలు అనూహ్యరీతిలో పెరిగిపోయాయి . సీజన్‌లో మేలిమి బంగారం ధరలను మించి పోయి క్వింటాలకు రూ.60వేల వరకు పలికింది. తెగుళ్ల బెడద అధికంగా ఉన్నప్పటికీ , మార్కెట్‌లో మంచి ధర లభించటంతో రైతులు ఈ సారి మిరపసాగుపట్ల మొగ్గుచూపారు.దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో మిపర సాగు 3.5లక్షల ఎకరాలకు పైగానే సాగు జరిగింది. ఖమ్మం, వరంగల్ , మహబూబాబాద్ , గద్వాల, సూర్యాపేట, తదితర జిల్లాల్లో మిరప పంటను అధికంగా సాగు చేశారు.

సీజన్ ప్రారంభంలో అధిక వర్షాలతో పోలాలు జోములెక్కి లేతపైర్లు కొంత దెబ్బతిన్నాయి. అయినప్పటికీ రైతులు అధైర్య పడకుండా మిరపపైర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా తామర పురుగు బెడదనుంచి మిరప పైర్లను రక్షించుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల వల్ల పంట దిగుబడి తగ్గినా , పెరుగుతున్న ధరలు రైతులకు పెద్ద ఊరటనిస్తున్నాయి.దేశవాళీ రకం ధరల్లో భారీగా పెరుగుదలతోపాటు సాధారణ రకాలు కూడా క్వింటాలుకు రూ.20వేలు పైగానే ధర పలుకుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ మార్కెట్‌లోపాటు పోరుగు రాష్ట్రాల్లోని గుంటూరు, ధార్వాడ్, ఇండోర్ , నాగపూర్ మిర్చి మార్కెట్లలో ఎండు మిరప విక్రయాలు జోరుమీద సాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News