Monday, December 23, 2024

‘రూ.1500 కోట్ల’ భూమికి ఎసరు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామపంచాయితీ పరిధిలో భారీ భూ కుంభకోణం వెలుగు చూసింది. సర్వే నెంబర్ 261లో 588 ఎకరాలలో 315 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనిలో భూమి హక్కులకు సంబంధించి నకిలీ రిజిస్ట్రేషన్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు గిఫ్ట్ డీడ్‌లు, పొజీషన్లకు సంబంధించి కేసులు అనేకం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, మరో 273 ఎకరాలకు సంబంధించి చూస్తే.. దీనిలో కొంత మొత్తంలో ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్ ఉంది. మరికొంత ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు, పేద రైతులకు, శ్మశానం, డంపింగ్ యార్డ్‌లకు కేటాయించడం జరిగింది. దాదాపు 117 మంది రైతులకు ఒక్కో ఎకరా చొప్పున అసైన్డ్ ల్యాండ్‌ను కేటాయించడం జరిగింది. ఇదిలా ఉండగా, వీటికి పాత పాస్ పుస్తకాలున్నా.. ధరణి ఆన్‌లైన్ ఎంట్రీ కాకపోవడంతో.. కొత్తగా హక్కులకు సంబంధించి ధరణి పోర్టల్లో లేటెస్ట్ సర్టిఫికెట్లు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 2007లో 613 ప్లాట్లతో లే ఔట్ వేసి ఇందిరమ్మ కాలనీ పేరిట 300 మంది పేదలకు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున అందజేశారు.

కాగా, ఇక్కడ మిగిలిన 313 ప్లాట్లపై ఎవరికీ స్పష్టత లేదు. ఎవరెవరికీ ఏ ప్రాతిపదికన ఎంత కేటాయిస్తున్నారో కూడా సంబంధిత అధికారులకు తెలియకపోవడం విడ్డూరం. ఈ మొత్తం వ్యవహారంపై గ్రామ సర్పంచ్ తిరుమల వాసు.. స్పష్టత తీసుకొచ్చేందుకు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తు పెట్టకున్నా ఎలాంటి ప్రయోజనం లేదంటున్నాడు. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది భూకబ్జాదారులు, పెట్టుబడిదారులు.. రైతులకు, పేదలకు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు కేటాయించిన ఈ మొత్తం 588 ఎకరాల ప్రభుత్వ భూమిని, ప్లాట్లను అన్యాక్రాంతం చేసేందుకు భారీ పథకం రచించారు. స్థానిక రెవెన్యూ, పంచాయితీ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక లీడర్లతో కుమ్మక్కై కోట్లాది రూపాయలు విలువైన భూములపై కన్నేశారు. ఈ భూముల్లో దర్జాగా లే అవుట్లు వేసి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ మొత్తం భూమి మార్కెట్ విలువ రూ.1500 కోట్లపైనే ఉంటుందని సమాచారం.

ఈ వ్యవహారం ఇలా ఉండగా, గ్రీన్ లేక్ ప్రాపర్టీ డెవలపర్స్ పేరిట 10 ఎకరాలు భూమిని లే అవుట్ వేసి, ప్లాట్లు విక్రయాలకు పెట్టారు. ఎర్రగడ్డలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీకి ఇక్కడి వందల ఎకరాల భూమిని ధారాదత్తం చేసేందుకు స్థానిక రాజకీయ నాయకుల చొరవతో రెవెన్యూ, పంచాయతీ అధికారులు భారీ ప్లాన్ వేశారు. ఘటనలో.. –1979 నాటికి 19 సంవత్సరాలు ఉండే వ్యక్తి పేరున తప్పుడు ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికెట్లు క్రియెట్ చేసి ఉద్దెల అనే మహిళకు 6 ఎకరాలు 1995 సంవత్సరంలో అమ్మినట్లు రిజిస్ట్రేషన్ చూపించి సుమారు రూ.50 కోట్ల భూమిని కాజేశారు. 19 సంవత్సరాలు ఉండే యువకుడు ఎక్స్ సర్వీస్‌మెన్ ఎలా అవుతాడన్న ఆలోచన కూడా లేకుండా ఇలా.. గతంతోపనిచేసిన కొంతమంది వార్డు సభ్యులు, అనధికారికంగా లే అవుట్లకు అనుమతులిచ్చి, ఫోర్జరీ సంతకాలు చేసి, బినామీల ముసుగులో వారి కుటుంబీకుల పేరిట దర్జాగా చెక్కులు తీసుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు. వీటన్నింటిపై దర్యాప్తు చేయాలని అర్జీలు పెట్టుకుంటే రూల్స్‌కు

విరుద్ధంగా రెండు రోజుల్లో తూతూమంత్రంగా

తనిఖీ చేసి క్లీన్ చిట్ ఇచ్చి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే అధికారులు చెక్ పవర్‌ను కట్టబెడుతున్నారన్న విమర్శలూ విన్పిస్తున్నాయి. 2020, జూన్ 29న అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపై గుమ్మడిదల పోలీస్ స్టేషన్లో ఈ మొత్తం వ్యవహారంపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని సర్పంచ్ వాసు ఆందోళన వ్యక్తం చేశాడు. తాజాగా లోకాయుక్తలో ఫిర్యాదు చేశామని, అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చినా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ మొత్తం భూ అక్రమాలపై హైకోర్టులో పిల్ వేస్తానని సర్పంచ్ వాసు తెలిపారు.

నాకు ప్రాణహాని

రైతుల, పేదల పక్షాన పోరాటం చేస్తున్నందుకు నన్ను టార్గెట్ చేసి సస్పెండ్ చేశారని, కేసులు ఉపసంహరించుకొని తమతో చేతులు కలపాలంటూ బెదిరిస్తున్నారని సర్పంచ్ తిరుమల వాసు ఆందోళన వ్యక్తం చేశారు. లేకుంటే అంతు చూస్తాం అని ఇటీవల కాలంలో బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. రియల్టర్లు, స్థానిక రెవెన్యూ అధికారులు, స్థానిక రాజకీయ నాయకులే బాధ్యత వహించాలన్నారు. భూ అక్రమాలపై ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర మంత్రి కెటిఆర్ స్పందించి.. భూ అక్రమార్కులపై చర్యలు తీసుకొని నాకు, నా కుటుంబానికి రక్షణ కల్పించాలని సర్పంచ్ వాసు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News