నాగర్ కర్నూల్: జిల్లాలోని తాడూరు మండలం ఇంద్రకల్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కొడుకుని హత మార్చిన ఘటన జిల్లాలో కలకం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాగుడుకు బానిసైన కొడుకుతో విసుగు చెందిన తండ్రి దారుణానికి పాల్పడ్డాడు.
నరసింహారెడ్డి, విమలమ్మ దంపతులకు ముగ్గురు మగసంతానం. పెద్ద కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి(38) తాగుడుకు బానిసై నిత్యం తల్లిదండ్రులను వేధిస్తుండేవాడు. శ్రీకాంత్ రెడ్డి రోజు మాదిరిగానే తాగి ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఈ పెనుగులాటలో శ్రీకాంత్ రెడ్డి కింద పడ్డాడు. కోపంతో తండ్రి రాయితో కొట్టడంతో రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆందోళన చెందిన తల్లిదండ్రులు పక్కనే ఉన్న వరి గడ్డిని తీసుకువచ్చి మృతదేహం పై వేసి కిరోసిన్, పెట్రోల్ పోసి నిప్పంటిచారు. శ్రీకాంత్ రెడ్డి మృతదేహం మంటల్లో కాలింది. విషయం కాస్త ఆనోటా ఈనోటా బయటకు పొక్కడంతో మిగతా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులను నిరదీశారు. ఈ ఘటనతో మరో కుమారుడు రవీందర్ రెడ్డి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.