Saturday, November 23, 2024

అదనపు టిఎంసికి లైన్‌క్లియర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడవ టీఎంసీ నీటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన భూసేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వుల్లో సవరణ చేసింది. అనుమతులు , విజ్ణప్తుల పరిశీలనకు గోదావరి నదీయాజమాన్య బోర్డు ,కేంద్ర జలసంఘంకు అనుమతి ఇచ్చింది. మూడవ టిఎంసి నీటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన భూసేకరణ చేపట్టడంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితోపాటు మరి కొం దరు రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బి.వి. నాగరత్న ధర్మాసనం సోమవారం నాడు విచారణ చేపట్టింది. రాజకీయ కారణాలతోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అడ్డుపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపిచింది. వాదనలు విన్న ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణలు చేసింది.

తుది తీర్పు ఉత్తర్వులకు లోబడే అనుమతులు ఉంటాయని వెల్లడించింది. నష్టపరిహారం తీసుకొని భూములు ఇవ్వదలుచుకున్న రైతులకు కూడా అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది వైద్యనాదన్ కోర్టుకు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసిర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రతిష్టాత్మక కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారు. కాళేశ్వరం సమీపాన మేడిగడ్డ వద్ద గోదావరి నదినుంచి 180టిఎంసీల నీటిని మళ్లింపునకు ఆనకట్టల నిర్మాణాలు చేపట్టారు. ఉత్తర తెలంగాణలోని 13జిల్లాల్లో 18,25,700ఎకరాలకు సాగునీటిని అందజేసేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాలకు 30టిఎంసీలను అందించటం, ఈ మార్గంలో ఉన్న గ్రామాలకు 10టిఎంసీలను తాగునీటికి మళ్లించటం, ప్రారిశ్రామిక అవసరాలకింద 16టిఎంసీలను అందిచటం , నీటిపారుదల కోసం భూగర్భ జల వినియోగం నుండి ఉపరితల వినియోగానికి మారడం , భూగర్భ జల మట్టాలను పునరుద్దురించడం లక్ష్యాలుగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.

మేడిగడ్డ బ్యారేజ్‌నుంచి అదనపు టిఎంసీ మళ్లింపు

ప్రతియేటా వర్షాకాలంలో గోదావరి నది నుండి భారీమొత్తంలో వరదనీరు సముద్రంలోకి వృధాగా పోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం గోదావరి నది నుంచి 2టిఎంసీల నీటిని మళ్లిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అనేక మధ్య తరహా , చిన్న తరహా ప్రాజెక్టులకు తగినంత నీటి ప్రవాహం లేక ఈ ప్రాజెక్టుల లక్ష్యాలు నెరవేరటంలేదు. ప్రతియేటా ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందక రైతులు నష్టపోవాల్సివస్తోంది. ఈ ప్రాజెక్టులకు అదనంగా నీటిని ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం గోదావరి నదినుంచి సాధ్యమైనంత ఎక్కువగా నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. గోదావరి నది నుంచి వరదల సమయాల్లో అదనంగా రోజుకు ఒక టిఎంసీ నీటిని మేడిగడ్డ బ్యారేజి దగ్గర నుంచే తీసుకొని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎత్తిపోయడం, మిడ్‌మానేరు జలాశయం నుంచి కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయానికి అందించనున్నారు. మల్లన్న సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్ధం 50టీఎంసీల నీటిని వేగంగా నింపాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం కాలువ సామర్ధాన్ని కొమరవెల్లి మల్లన్న సాగర్ వరకూ ఎక్కవ చేయడానికి ప్రతిపాదించారు.

అందువల్ల రోజుకు 1టిఎంసీల నీటిని మల్లన్న సాగర్‌కు మళ్లించడం ద్వారా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ప్రవాహం పెరగుతుంది. కాలువ సామర్ధాన్ని పెంచడం ద్వారా తక్కువ సమయంలో గోదావరి వరద జలాలును ఎక్కవ మేరకు మల్లన్న సాగర్ జలాశయంలోకి మళ్లించుకునే అవకాశం ఏర్పడనుంది. గోదావరి నదీజలాలు వృధాగా సముద్రం పాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించేందుకు కేసిఆర్ సర్కారు అలుపెరగని కృషి చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వ్యవసాయరంగంతోపాటు దాని అనుబంధంగా ఉన్న పశుసంపద, ఫౌల్ట్రీ, మత్స సంపద వంటి మిగతా రంగాల్లో భారీగా వృద్ధి జరగనుంది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం గోదావరి నుంచి అదనంగా రోజుకు 1టిఎంసీటి నీటిని మేడిగడ్డ బ్యారేజి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మళ్లించడానికి 2019ఏప్రిల్ 18న ఆదేశాలు జారీ చేసింది.

ఇందుకోసం రూ.4,966కోట్లకు ఆమోదం కూడా తెలిపింది.అన్నారం ఎత్తిపోతల పధకానికి రూ.3810కోట్లు, సుందిళ్ల ఎత్తిపోతల పథకానికి రూ.3616కోట్లకు ఆమోదం తెలిపింది. అదేవిధంగా మిడ్‌మానేరు జలాశయం నుండి కొమరవెల్లి మల్లన్న సాగర్ జలాశయంకు సమాంతరంగా నీటిని ఎత్తిపోయడానికి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చింది. మిడ్‌మానేరు జలాశయం నుండి అనంతగిరి జలాశయంకు సమాంతరంగా నీటిని కన్వేయర్ వ్యవస్థకోసం రూ.4,142కోట్లు, అనంతగిరి జలాశయం నుండి కొమరవెల్లి మల్లన్న సాగర్‌కు సమాంతరంగా నీటిని కన్వేయర వ్యవస్థ కోసం రూ.10,260కోట్లు కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News