న్యూఢిల్లీ: భారత సైన్యాధికారులపై ట్వీట్లు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(జెఎన్‌యుఎస్‌యు) మాజీ ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్ షోరాను ప్రాసిక్యూట్ చేయడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా అనుమతి మంజూరు చేశారు. అలఖ్ అలోక్ శ్రీవాస్తవ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుపై ఐపిపిలోని 153ఎ సెక్షన్ కింద స్పెషల్ సెల్ పోలీసు స్టేషన్‌లో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాఆదీనికి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి అనుమతి లభించింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడంతోపాటు నేరాలకు పాల్పడినందుకు సిఆర్‌పిసిలోని 196 సెక్షన్ కింద ఆమెను ప్రాసిక్యూట్ చేసేందుకు ఎల్‌జి అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. 2019 ఆగస్టు 18న షోరా ట్వీట్ చేస్తూ కశ్మీరులో స్థానికుల ఇళ్లలోకి చొరబడిన సైన్యం వారిని చిత్రహింసలు పెడుతున్నట్లు ఆరోపించారు. మరో ట్వీట్‌లో ఆమె షోపియాన్‌లో నలుగురు వ్యక్తులు ఆర్మీ క్యాంపులోకి పిలిపించుకుని చిత్రహింసలు పెట్టారని,స్థానికులను భయభ్రాంతులను చేయడానికి ఆ నలుగురు వ్యక్తుల సమీపంలో మైక్ పెట్టారని, వారి ఆర్తనాదాలు ఆ ప్రాంతంలోని వారందరికీ వినిపించడానికే సైన్యం అలాచేసిందని ఆమె ఆరోపించారు.