గౌహతి: బర్సాపార క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఇండియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. లంకపై 67 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 373 పరుగులు చేసింది. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో విజృంభించాడు. కోహ్లీ 87 బంతుల్లో 113 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 67 బంతుల్లో 83 పరుగులు, శుభమన్ గిల్ 60 బంతుల్లో 70 పరుగులు, రాహుల్ 29 బంతుల్లో 39 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. లంక శనకా కెప్టెన్ సెంచరీ చేశాడు. శనకా 88 బంతుల్లో 108 పరుగులు చేశాడు. లంక బ్యాట్స్‌మెన్లలో నిశాంక (72), దిసిల్వా (47), అసలంకా(23), వానిందు హసరంగా (16), చమిక కరుణారత్నే(14) పరుగులు చేసి ఔటయ్యారు. భారత జట్టు బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు పడగొట్టగా సిరాజ్ రెండు వికెట్లు, షమీ, హార్ధిక్ పాండ్యా, యుజేంద్ర చాహల్ తలో ఒక వికెట్ తీశారు. లంక బౌలర్లలో రజిత్ మూడు వికెట్లు పడగొట్టగా మదుశంకా, కరుణరత్నే, శనకా, ది సిల్వా తలో ఒక వికెట్ తీశారు.