పాలకులు అబద్ధ్దాలు, అతిశయోక్తులు, అశాస్త్రీయాలు వల్లించినా, ప్రజావ్యతిరేక విధానాలతో పాలించినా సహచరులు ప్రశ్నించరు. పెట్టుబడిదారీ పాలన ముదిరి సామ్రాజ్యవాదంగా మారుతుందని మార్క్ అన్నారు. సౌజన్య పక్షపాతం, నిరాసక్త్ నిష్క్రియాత్మకత కవలలు. ఈ దుష్టచతుష్టయాలు సామాజిక వినాశకాలు. అధినేతలకు, యజమానులకు మనస్తాపం కలుగుతుందని అసంతృప్తిని వ్యక్తీకరించని లేదా తక్కువగా ప్రస్తావించే స్పందనా తీరును, మానసిక ధోరణిని సౌజన్య పక్షపాతం అంటారు. తమ అభిప్రాయాన్ని, నిజాన్ని, జ్ఞానాన్ని దాచి సమాజం ఆమోదించే ఆలోచనను చెప్పడమే సౌజన్య పక్షపాతం.
దీన్ని హాథోర్న్ ఎఫెక్ట్ (పరిశీలక ప్రభావం) అని కూడా అంటారు. అమెరికా షికాగో వద్ద తొలిసారి ఈ ప్రభావాన్ని అనుభవించిన స్థలం హాథోర్న్. మనలను ఇతరులు గమనిస్తున్నప్పుడు వారికి అనుకూలంగా ప్రవర్తించడమే పరిశీలక ప్రభావం. ఆధునిక మానవున్ని ఆవరించిన అనేక అభిజ్ఞాత పక్షపాతాలలో ఇదీ ఒకటి. ‘వారు మా పోషకులు, మేము లబ్ధిదారులం. వారి సహాయానికి కృతజ్ఞులం. వారిని తప్పుపట్టం, విమర్శించం’. ఇదీ అనుచరుల సమర్థన. అధికారం దారితప్పి, నీతినిజాయితీలు తగ్గి, అహంకారం పెరిగి, పొగడ్తలకు పొంగి, తెగడ్తలకు కుంగి, తెగిడిన వారిని తెగటార్చుతున్నప్పుడు ప్రజా జీవితంలో, సామాజిక సంబంధాలలో సౌజన్య పక్షపాతం ప్రత్యక్షమవుతుంది.
అనేక అంశాలపై సర్వేలు జరుగుతాయి. సర్వే చేస్తున్న సంస్థ మద్దతు ఇవ్వాలనుకున్న వాళ్ళకు అనుకూల్ జవాబులు వచ్చేటట్లు ప్రశ్నావళి రూపొందిస్తారు. మన ప్రధాని పాత్రికేయులతో మాట్లాడరు. మోడీ అవసరార్థం ఆయన్ను అక్షయ కుమార్ లాంటి నటులు ఇంటర్వ్యూ చేశారు. తన కెనడా పౌరసత్వం వలన తనకు ఇబ్బంది రాకుండా ప్రశంసా ప్రశ్నలే వేశారు. ప్రజలు పాలకులకు కోపమొచ్చే జవాబులు చెప్పరు. తమ నైజాన్ని బయట పెట్టుకోరు. అభ్యుదయవాదులుగా నటిస్తారు. ఒక సర్వేలో 80% ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పాటు బడుతున్నామని చెప్పారు. అదే నిజమైతే పర్యావరణం ఎందుకు పాడవుతోంది? మేము పర్యావరణాన్ని పట్టించుకోమని ఎవరూ చెప్పరు. రాజకీయ ప్రశ్నలకూ ఆమోద జవాబులే ఇస్తారు. ప్రధాని ‘మనసు మాట’ కార్యక్రమం వింటారా? ప్రధాని పథకాలు, విదేశీ పెట్టుబడులు మంచివా? వంటి ప్రశ్నలకు విరుద్ధ జవాబులిచ్చి, సంఘీయుల సతాయింపుకు గురికావాలని ఎవరూ కోరుకోరు. ప్రభుత్వ చర్యలపై ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ముగ్గురు అస్మదీయులను అడుగుతారు. సహజంగా ముగ్గురూ సానుకూల జవాబులిస్తారు. నూరు శాతం మద్దతు లభించిందని ప్రకటిస్తారు.
ప్రజల వ్యక్తిగత సంబంధాలను అంచనా వేయడానికి మౌఖిక సమావేశాలు, గుణాత్మక అధ్యయనాలు, ప్రత్యక్ష పరిశీలనలు జరిపారు. ప్రజా సేవలను పరీక్షించారు. భారత్, పెరు, ర్వాండాలలో విరుద్ధ ఫలితాలొచ్చాయి. మందు పేరు తప్పుగాపలికినందుకు మొరాకో లో నర్సు నవ్వారని, ఎగతాళి చేశారని మెర్సిని అన్న వ్యక్తి అన్నారు.
మెరుగైన సేవలను కోరినందుకు ఈక్వడార్ లో స్క్రింషాకు, హోండురాస్‌లో ముండి గోకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వరుసగా నేపాల్, బొలీవియా, బంగ్లాదేశ్ లకు చెందిన స్కూలర్, రాంస్, హుసేన్ లు తమకు ఆస్పత్రుల్లో విరుద్ధ ప్రవర్తనలు ఎదురయ్యాయని, మమ్ములను మూర్ఖులుగా పరిగణించారని తెలిపారు.
అయినా బహిరంగ సర్వేలో మొరాకోలో 94%, ఈక్వడార్, ఉగాండా, జింబాబ్వేలలో 99%, కరీబియన్, లాటిన్ అమెరికాలలో 100% తమను మర్యాదగా చూశారని, తమకు అద్భుత సేవలు లభించాయని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లో ఆరోగ్య సేవలు అధ్వాన్నం. అయినా 2,428 మందిని సర్వే చేయగా 33% మందే నిజం చెప్పారు. జార్ఖండ్ రాష్ట్రం రాంచి జిల్లాలో బుర్ము, కంకే, ఒర్మాంఝి ప్రాంతాలలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డ స్త్రీలు గ్రామీణ ఆరోగ్య సేవలను గురించి నిజాలను దాచారు. ప్రభుత్వ శాఖలు శిక్షణా తరగతులు నిర్వహిస్తాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు లబ్ధి పొందుతారు. శిక్షణ తర్వాత ఫీడ్ బ్యాక్‌లో అందరూ అబద్ధాలే రాస్తారు. ప్రభుత్వ ప్రయోజనాలు పోతాయని భయం. ప్రజాధనం ఖర్చయినా శిక్షణల ప్రయోజనం నెరవేరదు.
కేంద్ర పాలకులు అమెరికా వత్తిళ్లకు లొంగారు.
చైనాను అడ్డుకోడానికి అమెరికా ఆధ్వర్యంలో క్వాడ్, ఐపిఇఎఫ్ సంస్థలలో పాల్గొన్నారు. అమెరికా అభివృద్ధి సంస్థ భారత వాణిజ్య శాఖ 2016 అక్టోబర్‌లో భారత నగదు రహిత వ్యవస్థకు ఒప్పందం చేసుకున్నాయి. నగదు రహితానికి అవసరమైన పరికరాలు, డిజిటల్ కార్డులు, పథకాలతో అమెరికా బహుళ జాతి సంస్థలు బాగా లాభపడ్డాయి. ప్రధాని మాయ మాటలతో ఏకపక్ష చట్ట విరుద్ధ పెద్ద నోట్ల రద్దు, అంత కంటే పెద్దనోటు ప్రవేశం చేశారు. మంత్రివర్గం, రిజర్వ్ బ్యాంక్ నోరు విప్పదు. ప్రజా వ్యతిరేక బిల్లులు, కార్యక్రమాలు, పథకాల విషయంలో మంత్రులు, అధికారులు పట్టించుకోరు. కేంద్ర నిఘా విభాగాలు, ఆర్థిక సంస్థలు, ఆదాయ విభాగం, ఎన్నికల సంఘం, అధికార గణం ప్రధాని మాట జవదాటరు. ఆయన ఆదేశాలను సంఘ్ గవర్నర్లు, విశ్వవిద్యాలయాల ఉపాధ్యక్షులు పాటిస్తారు. కార్పొరేట్ల విన్యాసాలకు పాలకులు చిందేస్తారు.
విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలలు, పరిశోధనాలయాల నిధుల కోత, దేశద్రోహం అభాండాలతో విద్యార్థుల నిర్బంధం ప్రగతి సాధిస్తాయా? సంస్కృతీ పునరుద్ధరణ పేరుతో మానవ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. భారతీయత పేరుతో అగ్రవర్ణ ఆధిపత్యాన్ని రుద్దుతున్నారు. ఇంతటి తిరోగమన ‘అభివృద్ధి’ నమూనా అమలును సంబంధితులెవరూ పట్టించుకోరు. సౌజన్య పక్షపాతం వీళ్ళను అడ్డుకుంటుంది. మనిషి మొండానికి ఏనుగు తలను అతికించిన ప్లాస్టిక్ సర్జరీ, జన్యుశాస్త్రం, కాండ కణ సాంకేతిక పరిజ్ఞానం వేదకాలంలోనే ఉన్నాయని మోడీ అన్నారు. ఆ సభలో పలువురు ప్రఖ్యాత వైద్యులు, శాస్త్రజ్ఞులు, అమితాభ్ బచ్చన్, సచిన్ తెండూల్కర్, సునిల్ గవాస్కర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఎవరూ నోరు విప్పలేదు. వీరందరికీ ఏదో భయం. అందుకే ఈ నిష్క్రియాపరత్వ సౌజన్య పక్షపాతాలు.
పాలక పక్షంగాక పాలిత పక్షం వహించి, నిజాన్ని నిర్భయంగా నివేదించేది పాత్రికేయత. వామపక్ష పత్రికలు తప్ప నేటి మాధ్యమాలన్నీ కార్పొరేట్ల్ సొంతం. కార్పొరేట్ల అధిపతులు, ప్రభుత్వాధినేతలు, మతాధికారులు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తున్నారు. నీకిది నాకది (క్విడ్ ప్రో కొ) సూత్రాన్ని పాటిస్తున్నారు. వార్తలు, కథనాలు, వ్యాసాలు, విశ్లేషణలు, వివరణలు, వీడియోలు, చిత్రాలు, సినిమాలు అన్నీ వీరి ప్రయోజనాలను కాపాడుతున్నాయి. సామాన్యుల, తాడిత, పీడిత జనాల, అణగదొక్కబడ్డవర్గాల, కూలీల, శూద్రుల, గిరిజన ఆదివాసుల, రైతుల, స్త్రీల సమస్యలను ప్రస్తావించవు. ఈ పత్రికల ఇంటర్వ్యూలు పాలకులను సంతోషపెట్టేవే. ఈ సౌజన్య పక్షపాతాలతో ప్రజాసేవలు ఇంకా అధ్వాన్నమవుతాయి. పాలకులు మరింత గర్విష్టులవుతారు. సామ్రాజ్యవాదం, ఫాసిజం పేరుగుతాయి. చట్టసభల్లోని ధనికులు, వాణిజ్యవేత్తలు, గుత్తేదారులు, పెట్టుబడిదారులు చేసే ప్రజావ్యతిరేక చట్టాలకు ఈ పత్రికలు ప్రజామోదాన్ని సాధిస్తాయి. మత ఛాందసాలను, మూఢ విశ్వాసాలను, అవినీతిని పోషిస్తాయి. ఇవన్నీ సౌజన్య పక్షపాతాలే.
సౌజన్య పక్షపాతం నకారాత్మకతను సకారాత్మకంగా మారుస్తోంది. శాస్త్ర పరిశోధనలను దారి తప్పిస్తుంది. సామాజిక శాస్త్రాల పరిశోధన, ప్రయోగాలపై దుష్ప్రభావం కలిగిస్తుంది. సౌజన్య పక్షపాతాలు పిల్లల, స్త్రీల, విద్యార్థుల, యువకుల వికాసం, నైతికత, అభివృద్ధి మీద చెడు ప్రభావాలను కలిగిస్తాయి. ఆర్థిక మోసాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని హుంకరించారు. మోసగాళ్ళు విదేశాలకు పారిపోయారు. సౌజన్య పక్షపాతం పక్షవాతంలా పని చేస్తోంటే ఇక్కడి మోసగాళ్లపై చర్యలుండవు, నల్లధనం రాదు, అవినీతి పోదు, ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోతుంది, రాజ్యాంగం రద్దవుతుంది, భారత్ హిందువాద దేశమవుతుంది.
సంగిరెడ్డి
హనుమంత రెడ్డి
9490204545