రాయబరేలి(యుపి): బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటాల యుద్ధం పతాక స్థాయికి చేరుతోంది. భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం హర్యానాలో యాత్ర సాగిస్తున్న సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను కౌరవులతో పోల్చడం తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. దీనిపై ఉత్తర్ ప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ స్పందిస్తూ రాహుల్ గాంధీకి తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా అంటే ప్రేమ ఉండవచ్చని, అయితే 50 ఏళ్ల వయసులో బహిరంగంగా తన సోదరిని ముద్దుపెట్టుకోవడం పాండవులలో ఎవరు చేశారని ప్రశ్నించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తన సోదరి పట్ల ప్రేమాభిమానాలను బహిరంగంగా వ్యక్తం చేయడం కనిపించింది.
ఆర్‌ఎస్‌ఎస్‌ను 21వ శతాబ్దపు కౌరవులుగా కూడా రాహుల్ అభివర్ణించారు. దీనిపై యుపి మంత్రి దినేష్ మంత్రి వ్యాఖ్యానిస్తూ ఆర్‌ఎస్‌ఎస్ కౌరవులైతే రాహుల్ పాండవులలో ఒకరా అని ప్రశ్నించారు. తనను తాను పాండవునిగా రాహుల్ భావిస్తే 50 ఏళ్ల వయసులో ఏ పాండవుడు తన సోదరిని బహిరంగంగా ముద్దు పెట్టుకున్నాడో రాహుల్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అది మన సంస్కృతి కాదని, అటువంటి చేష్టలకు భారతీయ సంస్కృతి అనుమతించబోదని ఆయన అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో రాయబరేలి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతిలో ఓటమిపాలైన సింగ్ వచ్చే ఎన్నికల్లో రాయబరేలిలో సోనియా ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి రావడానికి అనారోగ్యం కారణాలుగా చూపే సోనియా గాంధీ రాహుల్ పాదయాత్రలో మాత్రం పాల్గొంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాయబరేలి నుంచి నిష్క్రమించే చివరి విదేశీయురాలిగా సోనియా మిగిలిపోతారని ఆయన విమర్శించారు.