Monday, November 25, 2024

సమరోత్సాహంతో భారత్.. లంకకు చావో రేవో

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా గురువారం శ్రీలంకతో జరిగే రెండో వన్డేకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైన శ్రీలంక ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పించి లంకకు మరో మార్గం లేకుండా పోయింది. ఇక తొలి వన్డేలో గెలిచిన భారత్ రెట్టింపు ఆత్మవిశ్వాసంతో మ్యాచ్ బరిలోకి దిగుతోంది. కీలక బ్యాటర్లందరూ ఫామ్‌లోకి రావడం రోహిత్ సేనకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు తొలి మ్యాచ్‌లో శుభారంభం అందించారు. ఈసారి కూడా అలాంటి ఫలితాన్నే పునరావృతం చేయాలని తహతహలాడుతున్నారు. వీరిద్దరూ మరోసారి విజృంభిస్తే భారత్‌కు మరోసారి భారీ స్కోరు ఖాయం.

విరాట్ జోరు సాగాలి..
తొలి వన్డేలో కళ్లు చెదిరే సెంచరీతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై ఈసారి కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా రెండు సెంచరీలు సాధించి జోరుమీదున్న కోహ్లి హ్యాట్రిక్ శతకాలపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. కోహ్లి తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఈ మ్యాచ్‌లో కూడా లంక బౌలర్లకు కష్టాలు తప్పవు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న కోహ్లి విజృంభిస్తే ఈ మ్యాచ్‌లోనే సిరీస్‌ను సొంతం చేసుకోవడం భారత్‌కు కష్టమేమీ కాదు.

శ్రేయస్ అయ్యర్, రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తదితరులు కూడా తమ బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంది. వీరంతా సమష్టిగా రాణిస్తే రెండో మ్యాచ్‌లోనూ భారత్ భారీ స్కోరు సాధించడం తథ్యం. ఇక బౌలింగ్‌లో కూడా భారత్ బాగానే ఉంది. కానీ తొలి వన్డేలో కీలక బౌలర్లు షమి, ఉమ్రాన్‌లు భారీగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా వీరు పొదుపుగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తొలి వన్డేలో మెరుగ్గా బౌలింగ్ చేయడం టీమిండియాకు శుభసూచకంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా సిరాజ్ జట్టుకు కీలకంగా మారాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

గెలిచి తీరాల్సిందే..
మరోవైపు శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. తొలి వన్డేలో ఓపెనర్ నిసాంకా, కెప్టెన్ దాసున్ శనకలు అసాధారణ బ్యాటింగ్‌తో అలరించారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. ధనంజయ డిసిల్వా, కుశాల్ మెండిస్, కరుణరత్నె, అసలంక, హసరంగ తదితరులు కూడా తమ బ్యాట్‌కు పనిచెబితే లంక బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News