హైదరాబాద్: ముస్లింలు భారత దేశంలో నివసించడానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అనుమతి అవసరం లేదని ఎంఐఎం అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసి స్పష్టం చేశారు. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో నివసించేందుకు ముస్లింలను అనుమతించేందుకు భగవత్ ఎవరని ఒవైసి పశ్నించారు. మన పౌరసత్వంపై షరతులు పెట్టడానికి అతనికి ఎంత ధైర్యం? మేము మా విశ్వాసాన్ని సర్దుబాటు చేసుకోడానికి, నాగపూర్‌లో బ్రహ్మాచారుల సమూహాన్ని సంతోషపెట్టడానికి ఇక్కడ లేమని స్పష్టం చేశారు.
భారత్‌లో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే వారు తామే ఉన్నతులమనే భావాన్ని వీడాలని మోహన్ భగవత్ మంగళవారం వ్యాఖ్యానించారు. భగవత్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసి విరుచుకుపడ్డారు. అల్లా కోరుకోవడంతో తాము భారతీయులమని, తమ పౌరసత్వానికి షరతులు నిర్దేశించేందుకు ఆయనకు ఎంత ధైర్యమని నిలదీశారు. మీరు దేశంలో విభజన చిచ్చు రేపడంలో బిజీగా ఉంటూ ప్రపంచానికి వసుధైక కుటుంబం గురించి బోధించలేరని అసదుద్దీన్ తేల్చి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోడి ఇతర దేశాల ముస్లిం నేతలందరినీ కౌగిలించుకుంటారని, కాని తన స్వదేశంలో ఏ ఒక్క ముస్లింను హత్తుకోరని చురకలు అంటించారు. ఇది మోది, ఆర్‌ఎస్‌ఎస్ వాక్పటిమ, విద్వేశ ప్రసంగం మని ధ్వజమెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్ భావాజాలం భారత దేశ భవిష్యత్తుకు ముప్పు అని, భారతీయులు నిజమైన అంతర్గత శత్రువును ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని ఒవైసి అన్నారు. మంతం పేరుతో ఇలాంటి విద్వేషాన్ని, తీవ్రవాదాన్ని ఏ సమాచం సహించదని అన్నారు. భగవత్‌ను హిందువుల ప్రతినిధిగా ఎవరు ఎన్నుకున్నారని ఒవైసి ప్రశ్నించారు.