Saturday, December 21, 2024

మానవ కల్పిత మహోపద్రవం!

- Advertisement -
- Advertisement -

ఒక పట్టణం పట్టణమే కుంగిపోతున్నది. అక్కడి జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. నేల పేలపిండి కంటే బలహీనమైన స్థితిలో వుండడం వల్ల ఉత్తరాఖండ్‌లోని, చైనాతో సరిహద్దుల్లో గల చమోలీ జిల్లా జోషిమఠ్ (జ్యోతిర్మఠ్), దాని పరిసరాలు ఏటా 6.5 సెం.మీ లేదా 2.5 అడుగుల మేర కూరుకుపోతున్నాయని శాస్త్రజ్ఞులు హెచ్చరించినా ప్రభుత్వ యంత్రాంగాలు పెడచెవిన పెట్టినందున ఈరోజు అక్కడి ఇళ్ళు అడుగు వెడల్పు కొన్ని గజాల నిడివి గల బీటలువారి అందులో నివసిస్తున్న వారిని భీతావహానికి గురి చేస్తున్నాయి. గతంలో భారీ కొండ చరియలు విరిగిపడిన నేల మీద ఈ పట్టణాన్ని నిర్మించారని చెబుతున్నారు. ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుడు నిర్మించిన ఆరు శంకర మఠాల్లో ఒకటైన జోషిమఠ్‌లో 4500 భవనాలున్నాయి. ఇక్కడి ప్రజలు ఒకప్పుడు బౌద్ధులుగా వుండి ఆ తర్వాత హిందూ మతాన్ని స్వీకరించారని చెబుతారు.

700కి పైగా ఇళ్ళు ఇప్పుడు పగుళ్ళిచ్చి ప్రమాద సంకేతాలను పంపిస్తున్నాయి. భయోత్పాతులైన ఈ గృహాలలోని కుటుంబాలు ఇళ్ళు విడిచి ఆరుబయట చెప్పనలవికాని చలిలో నివసించడం ప్రారంభించడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి పునరావాసం కల్పించిందని వార్తలు చెబుతున్నాయి.ప్రస్తుతానికి 70 కుటుంబాలను ఖాళీ చేయించారు. మరి 90 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. గృహాలను కూల్చి వేయడానికి వెళ్ళిన యంత్రాంగాన్ని ప్రజలు అడ్డుకొంటున్నారు. రుషికేశ్ బదరీనాథ్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్7) మీద 6150 అడుగుల ఎత్తున గల జోషిమఠ్ భక్తజన యాత్రా స్థలమే కాకుండా ప్రకృతి తన సకల సౌందర్యాలతో విచ్చుకొని పరచుకొని వున్న ప్రాంతం. ట్రెక్కింగ్ జరిపే వారికి ప్రీతిపాత్రమైన చోటు. చిన్న చిన్న నదులు, సెలయేళ్ళతో అత్యంత ఆకర్షణీయంగా వుండే ఈ ప్రాంతాన్ని వదలబుద్ధి కాదు. ధూళి గంగ, అలకనందల సంగమం అయిన విష్ణు ప్రయాగ నుంచి జాలువారే హిమనదాలు ముచ్చటగొలుపుతాయి.

అలకనంద పర్వతం చుట్టూ జాతీయ ఉద్యాన వనాన్ని పెంపొందించారు. సైన్యంలో అతి ముఖ్యమైన దళాలు ఇక్కడ స్థావరమేర్పచుకొన్నాయి. ఒకప్పుడు తరచూ విరిగిపడుతూ వచ్చిన కొండ చరియల అవశేషాలతో నిండిన రాళ్ళు ఇక్కడ కనిపిస్తూ వుంటాయి. పైనున్న ప్రవాహాల వల్ల ఇక్కడి నేల నీళ్ళు చిమ్ముతుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం జోషిమఠ్ కింద హిమవాహిని వుండేదని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు, జల విద్యుత్కేంద్రాల నిర్మాణాన్ని పూర్తిగా నిలిపివేయాలని నిపుణులు ఏనాడో హెచ్చరించారు. 1976 మిశ్రా కమిషన్ చిప్కో ఉద్యమకారులు పొంచి వున్న ముప్పును గురించి హెచ్చరించడం జరిగింది. జాతీయ రహదారిని వెడల్పు చేయడం మానుకోవాలని కూడా సూచించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. జాతీయ థర్మల్ విద్యుత్కేంద్రా (ఎన్‌టిపిసి)నికి చెందిన తపోవన్ విష్ణుగఢ్ జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగ మార్గం ఇక్కడి నేలను మరింత గుల్లబారిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎన్‌టిపిసి దీనిని ఖండించింది. ఎన్‌టిపిసి జల విద్యుత్ ప్రాజెక్టు సొరంగం జోషిమఠ్ కిందినున్న బలహీనమైన భూమిలోంచి వెళుతుందని 2010లో భూగర్భ శాస్త్రజ్ఞులు సమర్పించిన పరిశోధక పత్రం హెచ్చరించింది.

ఒక్క ఉత్తరాఖండ్‌లోనే కాదు హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్‌లలో కూడా అనేక జల విద్యుత్ కేంద్రాలు, ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. వీటి వల్ల కలిగే లాభాల కంటే మానవాళికి సంభవించే విపత్తులు, నష్టాలే ఎక్కువ ఖరీదైనవని మొదటి నుంచి విజ్ఞులు చెబుతున్నారు. చూడదగ్గ ప్రదేశాలైనంత మాత్రాన అసంఖ్యాకంగా యాత్రికులు అక్కడకు వెళ్ళి అక్కడి సహజ ప్రకృతిని ధ్వంసం చేయడం అత్యంత ప్రమాదకరమైంది. జోషిమఠ్ సమీపంలో వున్న ఘంగారియా అనే గ్రామం అందమైన భూమట్టంతో అత్యంత ఆకర్షణీయంగా వుంటుంది. సుందరమైన సుమ లోయకు వెళ్ళే దారిలో 3000 మీటర్ల ఎత్తున ఈ గ్రామం వుంది. హేమ్‌కుండ్ సాహిబ్‌కు దీని ద్వారానే వెళ్ళాలి. అలాగే అవులి అనే ప్రకృతి అందాల విహార కేంద్రం కూడా ఇక్కడ వుంది. యాపిల్ పండ్ల తోటలు, పైన్ చెట్లతో ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ నిర్మిత అవులి సరస్సు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇంత చక్కటి ప్రకృతి సౌందర్యాలు కొలువున్న జోషిమఠ్ భూమిలో కుంగిపోతూ వుండడం మనం చేజేతులా తెచ్చిపెట్టుకొంటున్న మహోపద్రవం. ఇప్పటికైనా మేలుకొని అక్కడి ప్రాజెక్టులను శాశ్వతంగా మూసివేసి సరైన పరిశీలన, పరిశోధనతో ఈ ప్రళయానికి గల కారణాలను తెలుసుకొని వాటిని ఎప్పటికీ తిరిగి తలెత్తకుండా అరికట్టవలసి వుంది. ప్రకృతి ఒడిలో కేరింతలు కొట్టవలసిన మానవుడు దానిని బలి తీసుకోడం ద్వారా బలవాలనుకోడం అత్యంత హేయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News