Monday, December 23, 2024

కెరటం ఆయన ఆదర్శం

- Advertisement -
- Advertisement -

పాశ్చాత్యుల పాలనలో మగ్గుతూ స్వీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదకు భారత జాతి దూరమైన కాలంలో హిందూ ధర్మ కీర్తి పతాకను విదేశాలలో రెపరెపలాడించిన జాతి రత్నం, నిత్య చైతన్య మూర్తి, గొప్ప తాత్వికుడు మన స్వామి వివేకానంద. లేవండి మేల్కొనండి గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి… వంటి సూక్తులతో తన ఉపన్యాసాలతో ఇతర దేశాల్నీ ఉర్రూతలూగిస్తూ భారతదేశం పట్ల వాటికి అప్పటి వరకు ఉన్న భావనల్నీ సమూలంగా మార్చగలిగిన ధీశాలి మన నరేంద్రుడు… నేడు ఆ ఆదర్శ మూర్తి 160 వ జన్మదినం. జాతీయ యువజన దినోత్సవం. ‘కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడిన కూడా లేస్తున్నందుకు’ అన్న సిద్ధాంతాన్ని నమ్మిన స్వామి వివేకానంద దౌర్భర్యాల నుంచి నైతిక వికాస దిశగా నడిపించే ధర్మక్షేత్రంగా భారత దేశాన్ని అభివర్ణించారు.

అలాంటి మహోన్నత నిత్య చైతన్య మూర్తి స్వామి వివేకానంద 1863 జనవరి 12న పశ్చిమ బెంగాల్లోని కలకత్తా నగరంలో విశ్వనాథ దత్తు, భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వాలను వ్యావహారిక స్థితిలోకి తెచ్చిన వివేకానందునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ దత్తు. ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. తండ్రి మరణం, ఆర్థిక పరిస్థితులను ఆయనను కుంగదీసాయి. అనంతర కాలంలో రామకృష్ణ పరమహంస సన్నిధి ఆయన జీవిత లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ ఆధ్యాత్మక గురుదేవులు పరమపదించిన తర్వాత వివేకానందుడు హిమాలయ పర్వతాల నుండి కన్యాకుమారి వరకు యావత్ దేశాన్ని కాలినడకన చుట్టి కోట్లాది జీవితాలను నిశితంగా గమనించి దేశ స్థితిగతులను అవగతం చేసుకున్నాడు.
1893 సెప్టెంబర్ 11న అమెరికాలోని చికాగో సర్వమత సమ్మేళనంలో హిందూ ధర్మ ప్రతినిధిగా పాల్గొన్న వివేకానందుడు తేజోవంతమైన ఉపన్యాసం సభలోని వారందరిని మంత్రముగ్ధుల్ని చేసింది.

సభలో ప్రియమైన సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించిన ఆయన ఉపన్యాసం భారతదేశ ప్రాచీన గొప్పతనాన్ని, హిందూమత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన విధానం వల్ల ప్రపంచ దేశాలకు భారత దేశం పట్ల ప్రత్యేక గౌరవం తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచి వివేకానంద ఉపన్యాస పరంపర ప్రపంచంలోని అనేక దేశాల్లో అప్రతిహతంగా సాగింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలను సందర్శించి అందర్నీ ఆకట్టుకున్నారు. 1897 జనవరిలో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకానందకు భారతదేశం నీరాజనం పట్టింది. ఆ ఏడాది రామకృష్ణ మిషన్ స్థాపించి భారతీయులలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి వివేకానంద కృషి చేశారు. భారతదేశం తిరిగి తన శక్తిని చాటుకుని పూర్వ వైభవాన్ని పొంది ప్రపంచానికే మార్గదర్శకం నిలవాలని ఆయన ఆశయం. త్యాగం సేవలను విస్తరిస్తూనే జాతి బలోపేతం అవుతుందని భారతీయులకు ఆయన చాటి చెప్పేవారు.

భారత మాత పునర్ వైభవం కోసం అహరహం తపించిన వివేకానందుడు 39వ ఏట 1902 జూలై 4న పరమపదించారు. భారతదేశంలో ప్రస్తుత జనాభా త్వరలో 140 కోట్లకు చేరుకోనుంది. దేశ ప్రజల సగటు వయస్సు 29 సంవత్సరాలు చేరుకుంది. దేశ జనాభాలో యువత జనాభా 64 శాతం ఉంది. అమెరికా, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలతో పోలిస్తే అత్యంత యువ సంపన్న దేశంగా భారత్ ప్రస్తుతం కళకళలాడుతుంది. కొన్ని దశాబ్దాలుగా విద్య , ఆరోగ్య రంగాలను ప్రభుత్వం పట్టించుకోని ఫలితంగా దేశంలో పని చేసే ప్రతి పది మందిలో తొమ్మిది మంది అస్థిరమైన ఏ మాత్రం సామాజిక రక్షణ లేని అసంఘటిత రంగంలో మగ్గిపోతున్నారు. దేశంలో ప్రస్తుతం సుమారు ఏడు కోట్ల మంది యువత ఉపాధి కల్పన కార్యాలయంలో పేరు నమోదు చేసుకొని ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు. విద్యా వ్యవస్థ వృత్తి విద్య పై ప్రభుత్వం చేస్తున్న వ్యయం మరి తీసికట్టుగా మారడం వల్లే ఈ దుస్థితి తలెత్తుతోంది.

ఉపాధికి అక్కరకొచ్చే అక్షరజ్ఞానం గానీ మనిషి నిలబెట్టే నిండైన ఆరోగ్యం గాని అందుబాటులో లేని దేశంలో యువ భారతం వికసించడం లేదు. నైపుణ్య భారత్, మేక్ ఇన్ ఇండియా, ప్రధానమంత్రి కౌశల్ యోజన పేరట కొంత కాలంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాల ద్వారా యువతకు ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు. స్వార్థపూరిత అవసరాల కోసం మనిషిని అవసరాలకు వాడుకుంటున్నా పార్టీలు, కుల సంఘాలు, రాజకీయ నాయకుల చేతిలో యువత నలిగిపోతున్నది. జాతి, వర్ణ, వర్గ, కుల విభేదాలను అధిగమించి సవాళ్లను ఎదుర్కొంటూ మానవత పరిమళాలతో ఉక్కు నరాలు ఇనుప కండరాలు బలం గలిగిన నిఖార్సైన యువతగా భారత దేశం తయారు కావాలి. అప్పుడే వివేకానంద ఆశయాలకు సార్థకత చేకూరుతుంది.

అంకం నరేష్
6301650324

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News