సూర్యకాంతి లోని ప్రమాదకరమైన అతినీల లోహిత కిరణాలను భూమి ఉపరితలంలో ఉండే ఓజోన్ వాయువు పీల్చుకుని భూమిని రక్షిస్తుంది. అలాంటి ఓజోన్ పొరలోని సాంద్రత తగ్గి ఓజోన్ క్షీణించడం 1970 నుంచి ప్రారంభమైంది. ఇందులో రెండు సంఘటనలు ఉన్నాయి. భూవాతావరణం లోని మొత్తం ఓజోన్ పొర నాలుగు శాతం క్రమంగా తగ్గుతుండడం ఒకటి కాగా, వసంత కాలంలో భూమి ద్రువ ప్రాంతాల చుట్టూ స్ట్రాటోస్పియర్ లోని ఓజోన్‌లో పెద్ద ఎత్తున తగ్గుదల కనిపించడం రెండోది.
ఈ రెండో పరిణామాన్నే ఓజోన్ రంధ్రం అంటారు. ఓజోన్ పొర క్షీణించడానికి ప్రధాన కారణం క్లోరోఫ్లోరోకార్బన్స్ ( సిఎఫ్‌సి ) ప్రభావం. ఇవి రిఫ్రెజిరేటర్లు, స్ప్రేకాన్స్, ఎయిర్ కండిషనర్లు తదితర సాధనాల నుంచి విడుదల అవుతుంటాయి. 1982లో మొట్టమొదటిసారి ఓజోన్ రంధ్రాన్ని కనుగొన్నారు. 2019లో ఇది అత్యంత చిన్న పరిమాణంలో ఉందని నాసా ప్రకటించింది. ఓజోన్ క్షీణిస్తే క్యాన్సర్, కంటిజబ్బులు, వంటి వ్యాధులు వ్యాపిస్తాయని, ఇతర ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు.
మొక్కలు, జంతువులకు కూడా హాని కలుగుతుంది. ఈ నేపథ్యంలో 1987 లో ప్రపంచ దేశాలన్నీ (46) మాంట్రియల్ ప్రోటోకాల్ అమలు లోకి తెచ్చాయి. ఓజోన్‌కు నష్టం కలిగించే రసాయనాల ఉత్పత్తిని నిషేధించాలని తీర్మానించాయి. ఈ నిషేధం 1989 నుంచి అమలు లోకి వచ్చింది. ఫలితంగా 1990 మధ్యకాలంలో దశల వారీగా ఓజోన్ స్థాయి తగ్గకుండా నిలిచింది.
2000లో ఓజోన్ పొర పుంజుకోవడం ప్రారంభమైంది. ఇది ఇలాగే కొనసాగి 2040 నాటికి ఓజోన్ రంధ్రం 1980 కి పూర్వం నాటి స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తల అంచనా. నాలుగు దశాబ్దాల్లో ఓజోన్ రంధ్రం పూడ్చుకోవడం పుంజుకుంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన నిపుణుల కమిటీ భావిస్తోంది. అలాగే ఆర్కిటిక్ ఓజోన్ స్థాయి 2045 నాటికి, అంటార్కిటికా ఓజోన్ స్థాయి 2066 నాటికి పుంజుకుంటాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.