Monday, December 23, 2024

గవర్నర్ల వ్యవస్థ దిగజారుడు

- Advertisement -
- Advertisement -

తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠం నుంచి ఆ రాష్ర్ట గవర్నర్ ఆర్.ఎన్.రవి కొన్ని భాగాలను తొలగించి, ఈ నెల 9వ తేదీన శాసన సభనుద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదమైంది. శాసనసభ నుంచి వాకౌట్ చేసి గవర్నర్ వెళ్ళిపోవడం కూడా ప్రజాస్వామిక సంప్రదాయాల ఉల్లంఘన కిందకే వస్తుందనేది విజ్ఞుల భావన. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ర్ట ప్రభుత్వ విచక్షణాధికారాన్ని గవర్నర్ తన చర్యలతో ఒక సవాలు చేసినట్టయింది.

గవర్నర్ వ్యవస్థను రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడం ఇది కొత్త కాదు. భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న సమయంలో పాటియాలా ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పిఇపిఎస్‌యు) అసెంబ్లీని 1953లో రద్దు చేయడంతో ఇది మొదలైంది. ఆ తరువాత కేరళలోని నంబూద్రిపాద్ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 356 అధికరణం కింద రద్దు చేశారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు 356 అధికరణం ఏళ్ల తరబడి దుర్వినియోగం అవుతూనే ఉంది. నరేంద్ర మోడీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని రాష్ట్రాలలోని పాలనా వ్యవస్థపై పట్టు కోసం కేంద్రం కొత్త ఎత్తులను ఉపయోగించింది. ప్రతిపక్ష పార్టీ నాయకులపై ఇడిని, సిబిఐని ప్రయోగించడంతో పాటు, గవర్నర్ల వ్యవస్థను కూడా ఉపయోగించుకుంది. ఆయా రాష్ట్రాలలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, వారిని ప్రజా వ్యతిరేకులుగా చిత్రించడం గవర్నర్ల ద్వారా మొదలైంది. అటల్ బిహారి వాజ్‌పేయీ సహా అనేక మంది తమ రాజకీయ ప్రయోజనాల కోసం గవర్నర్ల వ్యవస్థను వాడుకున్నప్పటికీ, ఇంత అసహ్యకరంగా, నిర్లజ్జగా వాడుకోవడం మోడీ కాలంలోనే మొదలైంది.

బిజెపియేతర పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో గవర్నర్లు గొడవపడే విధానాన్ని చూస్తూనే ఉన్నాం. ఢిల్లీలోని రోజువారీ పాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడంపై అక్కడ అధికారంలో ఉన్న ఆవ్‌ుఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం వల్ల అఖిల భారత సివిల్ సర్వీస్ అధికారులు కూడా తమతమ శాఖల మంత్రుల మాటలను ఖాతరు చేయని పరిస్థితి ఏర్పడింది. ఆప్ ప్రభుత్వం ప్రతి ఏటా ఏర్పాటు చేసే చాతపూజను చవకబారు ప్రచార యావగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యానించడం, అక్టోబర్ 2న జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదని ‘ఆమోదయోగ్యం కాని భయంకరమైన తప్పిదం’ గా అభివర్ణించడం, ఉచిత యోగా పథకానికి రాష్ర్ట ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అభ్యంతరం చెప్పడం వంటివన్నీ కాషాయ శిబిరాన్ని సైతం ఆశ్చర్యపరిచాయి. బిజెపియేతర పార్టీల పాలిత రాష్ట్రాలలో గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారో చెప్పడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
మోడీ పాలనలో గవర్నర్లు ఎలా వ్యవహరించాలో గతంలో బెంగాల్ గవర్నర్‌గా పని చేసిన జగదీప్ ధంకడ్ కొత్తగా వచ్చిన

గవర్నర్లకు మార్గదర్శకంగా తయారయ్యారు. ముఖ్యమంత్రులకు రాత్రి పూట నిద్ర పట్టకుండా ఎలా చేయాలో తన చర్యల ద్వారా నిరూపించారు. ‘నేనేమీ మీ సేవకురాలిని కాను’ అని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎదిరించే స్థాయికి తెచ్చారు. ‘రోజూ తన కార్యాలయానికి ఫోన్ చేసి కలెక్టర్లు, ఎస్పీల నుంచి, చీఫ్ సెక్రటరీ వరకు ధంకడ్ బెదిరించడం మొదలుపెట్టారు. విధాన నిర్ణయాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదు. నిజానికి ‘పెగాసిస్’ వంటి స్పైవేర్ రాజ్‌భవన్ నుంచే పని చేస్తోంది’ అని ఆమె ఆరోపించారంటే పరిస్థితి ఏ స్థితికి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. ధంకడ్ చర్యల్లో కొన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళాయి.

కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అరిఫ్ మహ్మద్ ఖాన్ రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో బాగానే ఉన్నారు. బెంగాల్ గవర్నర్‌గా వ్యవహరించిన ధంకడ్ ఉపరాష్ర్టపతి పదవికి చేసిన ప్రయత్నంలో భాగంగా అరిఫ్ మహ్మద్ ఖాన్‌తో సంప్రదింపులు జరిపి, కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వ్యవహరించేలా చేశారు. ఫలితంగా కేంద్రం దృష్టిలోపడి ఉపరాష్ర్టపతిగా ధంకడ్ ఎన్నికయ్యారు. దాంతో అరిఫ్ మహ్మద్‌ఖాన్, ధంకడ్ అడుగుజాడలలో నడుస్తూ స్థానిక కాషాయ నాయకులతో సంబంధాలు నెరిపారు. రాష్ర్ట ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతి చిన్న విషయాన్నీ ఉపయోగించుకుంటున్నారు. కొందరు మంత్రులను పదవుల నుంచి తొలగించడం ద్వారా రాజ్యాంగ నిపుణుల నుంచి కూడా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. ‘మత్తు పదార్థాల రాజధానిగా ఉన్న పంజాబ్ స్థానాన్ని ఇప్పుడు కేరళ ఆక్రమించింది’ అని ఆరోపించడమే కాకుండా, పదిహేను విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్లను కూడా తొలగించేశారు.

ఈ తొలగింపు ప్రస్తుతం కోర్టు స్టేలో కొనసాగుతోంది. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో, 2013లో విశ్వవిద్యాలయాలకు చాన్సలర్లుగా గవర్నర్లు ఉండడానికి వీలు లేకుండా చేశారు. ‘నీవు నేర్పిన విద్య నీరజాక్ష’ అన్నట్టుగా, ఇప్పుడు తమిళనాడు, బెంగాల్, కేరళలో కూడా విశ్వవిద్యాలయాల చాన్సలర్లుగా గవర్నర్లను తొలగించేలా శాసన సభలో తీర్మానాలు చేశారు. ఉన్నత విద్యను కాషాయీకరణ నుంచి రక్షించడానికి వీరీ చర్యలు చేపట్టారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ (టిఆర్‌ఎస్) ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేయడానికి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్‌ను కేంద్రం ఉపయోగించుకుంటోంది. శాసన సభ ఆమోదించిన తెలంగాణ విశ్వవిద్యాలయాల బిల్లును ఆమోదించకుండా గవర్నర్ తొక్కిబెట్టారు. అలాగే మరో ఎనిమిది బిల్లులను కూడా ఆమోదించలేదు. తనపైన వచ్చే ఆరోపణలను కప్పిపుచ్చడానికి తన పోన్‌ను టాప్ చేస్తున్నారని, తాను మహిళను కనుక తన పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆమె రాష్ర్ట ప్రభుత్వంపైన ఆరోపణలు చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థ ద్వారా బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో ఒక ప్రమాదకరమైన క్రీడను చేపట్టింది. తమ పార్టీ ప్రయోజనాల కోసం రాజ్యాంగ ఆదేశాలను, సంప్రదాయాలను కాలరాస్తోంది. చాన్సలర్లుగా నిర్వహించాల్సిన తమ పాత్రను విద్య కాషాయీకరణకు వాడుకుంటున్నది. బిజెపియేతర పాలిత రాష్ట్రాలలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టడం సర్వసాధారణమై పోయింది. ఫలితంగా రాష్ట్రాల్లో అభివృద్ధిని స్తంభింప చేస్తూ, ఆయా ప్రభుత్వాలను అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రయత్నిస్తోంది. గవర్నర్లు ఇలా వ్యవహరించాలని నిజానికి రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడా నిర్దేశించలేదు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవె స్పష్టం చేశారు.

గవర్నరు రాజ్యాంగాధిపతిగా ఉండాలే కానీ, ఎలాంటి పాలనాధికారాలు వారికి ఉండవని రాజ్యాంగం చెపుతోందని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ పి.డి.టి ఆచార్య వ్యాఖ్యానించారు. రాజ్ భవన్‌లో కూర్చుని రోజూ పత్రికల వారితో మాట్లాడుతూ గవర్నర్లు ప్రచారం పొందుతున్నారు. గవర్నర్ల అధికారాలు, బాధ్యతలు అనేవి న్యాయవ్యవస్థ నిర్ణయించాల్సిన అంశాలు. రాష్ర్ట ప్రభుత్వంతో ఆమోదించని విషయాలను గవర్నర్లు బహిరంగ పరచకూడదని, ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రితో చర్చించడం కానీ, లేఖ రాయడం కానీ చేయాలని సి.రంగరాజన్ హితవు పలికారు.

‘రాష్ట్రాలలో గవర్నర్లు స్నేహపూర్వకంగా, తాత్వికంగా, మార్గదర్శకులుగా వ్యవహరించాలి’ అని 2021, నవంబర్ 11వ తేదీన రాష్ర్టపతిగా ఉన్న రామనాథ్ కోవింద్ హితవు పలికారు. గవర్నర్లకు, లెఫ్టినెంట్ గవర్నర్లకు, పరిపాలనాధికారులకు కలిపి రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన 51వ మహాసభలో తమిళనాడు గవర్నర్ రవి కూడా పాల్గొన్నారు. రాష్ర్టపతి చెప్పిన మాటలు తమిళనాడు గవర్నరుకు ఏ మాత్రం ఎక్కినట్టు లేదు. శాసన సభనుద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం తమిళనాడు అసెంబ్లీలో ఉల్లంఘించినట్టు ఇంత వరకు ఏ రాష్ర్ట అసెంబ్లీలోనూ జరగలేదు. తమిళనాడు (తమిళ దేశం) రాష్ట్రానికి ఆపేరు తీసేసి ‘తమిజగం’ (తమిళులు నివసించే ప్రాంతం) అని మార్చుకోమని గవర్నర్ ఇటీవల చేసిన వ్యాఖ్యానానికి నిరసనగా అధికార డిఎంకె సభ్యులతో పాటు, కాంగ్రెస్, వామపక్షాలు, విదుతలైచిరుతైగల్ కచ్చి(విసికె) సభ్యులు చేసిన నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. తమిళనాడు ప్రభుత్వం అనడానికి బదులు ఈ ప్రభుత్వం అని పలికారు.

‘సామాజిక న్యాయం, మహిళలకు సమాన హక్కులు, ద్రవిడ తరహాలో ఆత్మాభిమానం’ వంటి వాక్యాలను తొలగించి మాట్లాడారు. అంతే కాకుండా ఇ.వి. రామస్వామి పెరియార్, బాబా సాహెబ్ అంబేడ్కర్, కె.కామరాజ్, అన్నాదురై, కలైగ్నర్ కరుణానిధి అన్న పేర్లను తొలగించి ప్రసంగించారు. అనంతరం ముఖ్యమంత్రి ఎవ్‌ు.కె. స్టాలిన్ జోక్యం చేసుకుని తమిళనాడు అసెంబ్లీ నిబంధన 17ను సడలిస్తూ, తమిళనాడు ప్రభుత్వం తయారు చేసిన గవర్నర్ ప్రసంగాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా ఉన్నది ఉన్నట్టు రికార్డులకెక్కించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వ్యతిరేక వ్యాఖ్యానాలు చేశారు.

గవర్నర్ నియామకం ఎలా జరపాలన్న దానిపైన రాజ్యాంగ సభ అనేక సార్లు సమావేశమై చర్చించింది. గవర్నర్‌ను వయోజన ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలన్నది మొదటి పద్ధతి, అసెంబ్లీ సభ్యు లు ఎన్నుకోవాలన్నది రెండవ పద్ధతి, అసెంబ్లీ తయారు చేసిన ప్యానెల్‌లో ఒకరిని రాష్ర్టపతి నియమించాలన్నది మూడవ పద్ధతి. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా కాపాడడం, గవర్నర్ ఎన్నికతో శాసన సభను బుజ్జగించడానికి, శాసన సభ తయారు చేసిన ప్యానల్‌లో ఎంపికైన వ్యక్తితో ఘర్షణకు అవకాశం లేకుండా చేయడానికే పై విషయాలు చెప్పారు. చివరికి రాష్ట్రాల గవర్నర్లను రాష్ర్టపతి ఎంపిక చేసే విధానాన్నే నిర్ణయించారు. ముఖ్యమంత్రితో రాజకీయంగా సమానమన్న భావనను తిరస్కరించడానికి గవర్నర్ల నియామక విధానం కొనసాగుతోంది. రాజ్యాంగపరంగా గవర్నర్ల విచక్షణాధికారాలన్నీ చాలా పరిమితంగా ఉంటాయి. రాజ్యాంగంపైన ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టే గవర్నర్లు, వాస్తవ స్థితిలో స్వార్ధ రాజకీయాల కోసం కేంద్రంలోని అధికార పార్టీ ఎజెండాతో వ్యవహరిస్తున్నారు.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News