హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్దతో తెలంగాణలో దశాబ్ధాల తరబడి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం లభిస్తోంది. ఇరుగు పోరుగు రాష్ట్రాలతో జల జగడాలు సమసి పోతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కేంద్ర పర్యావరణ అటవీ శాఖల నుంచి చనాకాకోరాటా ప్రాజెక్టుకు అనుమతులు లభిచటంతో ఇక ఈ ప్రాజెక్టు పనులు ఊపందుకోనున్నాయి. గోదావరి నదీ పరివాహకంగా ఉన్న ప్రధాన ఉపనదుల్లో పెన్‌గంగ నదిపై తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మిస్తున్న ఈ బ్యారేజితో ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మిస్తున్న చనాకాకొరాటకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఆమోదం ఇదివరకే లభించింది. బ్యారేజి నిర్మిస్తున్న ప్రాంతానికి సమీపాన తాపేశ్వరం వణ్యప్రాణి సంరక్షణ ప్రాంతం ఉండటం వల్ల తొలుత ఈ ప్రాజెక్టుకు పట్ల వణ్యప్రాణి బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
1975లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు అప్పటినుంచి కోల్డ్ స్టోరేజిలో ఉంటూ వచ్చింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకుని 2016లో తనే స్వయంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టును రూ.1227కోట్ల ప్రాధమిక అంచనాలతో చేపట్టి రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ లక్షంగా పెట్టుకున్నారు. ఈ ఉమ్మడి ప్రాజెక్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించటంతో వణ్యప్రాణి సంరక్షణ బోర్డు స్టాండింగ్ కమిటి కూడా కొన్ని షరతలుతతో 2021లో బ్యారేజి నిర్మాణ పనులకు ఆమోదం తెలిపింది. వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో 213హెక్టార్లు అటవేతర భూమి ఉండటంతో దీనికి పర్యావరణ అనుమతులు అవసరమయ్యాయి. వణ్యప్రాణి ప్రాంతం సున్నితమైన ప్రాంతం కావటం వల్ల బ్యారేజి నిర్మాణం సందర్బంగా పెద్ద శబ్ధాలు వచ్చే యంత్రాలు వాడరాదని, ప్రాజెక్టు పనులకు సంబంధించి కార్మికులకోసం ఏర్పాటు చేసే కాలనీలు దూరంగా వేయాలని షరతలు పెట్టింది. శుక్రవావరం కేంద్ర అటవీ , పర్యావరణ శాఖల నుంచి కూడా చనాకాకొరాట ప్రాజెక్టుకు అమోదమద్ర పడింది. ఈ ప్రాజెక్టుకు లభించిన అనుమతల సమాచారాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది.
కరువు ప్రాంతంలో 50వేల ఎకరాలకు సాగునీరు:
పెన్‌గంగపై అంతర్ రాష్ట్ర ప్రాజెక్టుగా నిర్మిస్తున్న చనాకాకొరాట ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణలోని తాంసి , బేల మండలాల పరిధిలోని 50వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందనుంది. జనథ్ మండల్ కొరాటా గ్రామం వద్ద ఈ ప్రాజెక్టును నిర్మాణంలో ఉంది. పెన్‌గంగ నదిపై 0.8టిఎంసీల నీటి నిలువ సమార్ధంతో నిర్మిస్తున్న ఈ బ్యారేజికి మొత్తం 23గేట్లు అమర్చారు. బ్యారేజి నుంచి గ్రావిటీ ద్వారా 42కి.మి నిడివిన ప్రధాన కాలువ నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టులో అంతర్బాగంగా 3.5టిఎంసీల నీటినిలువ సమార్ధంతో మరో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. పెన్‌గంగ నదిలో నీటి ప్రవాహం ఉన్నంతవరకూ, అక్టోబర్ నెల వరకూ 51వేల ఎకరాలకు సాగు నీరు అందించేందకు వీలు కలుగుతుంది.
నవంబర్ నెల నుండి పెన్‌గంగనదిలో నీటి ప్రవాహం తగ్గటం వల్ల ప్రతిపాదిత ఆయకట్టుకు ఇబ్బందులు తలెత్తకుండా వరద కాలువ ద్వారా వచ్చిన నీటిని నిలువ చేసుకునేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్‌కోటి ,గొల్లఘాట్ థాంసీ గ్రామాల మధ్య సహజ లోయ వద్ద పిప్పిల్‌కోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించేందకు ప్రతిపాదించారు. ప్రధాన బ్యారేజితోపాటు పాటు కాలువలు , ఇతర రిజర్వాయర్ల పనులు ఇక వేగం పుంజుకోనున్నాయి. వీలైనతంత వేగంగా పనులు పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించేందకు ప్రభత్వుం చర్యలు చేపట్టింది.