టమాట కూర చిచ్చు,
అత్తకోడళ్ల లొల్లి.
భార్య ఫిర్యాదుతో, తల్లిపై దాడి చేసిన కొడుకు
మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం వేంనూరు గ్రామంలో ఆత్త కోడళ్ల మధ్య జరిగిన ఘర్షణ చిలికిచిలికి గాలివానలా మారింది. టమాటకూర బాగా వండలేదని కోడలిని అత్త తిట్టడంతో భర్తకు ఫిర్యాదు చేసింది. కుమారుడు తన తల్లిని కత్తితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేందర్ అనే వ్యక్తి తన భార్య నందిని, తల్లి బుజ్జితో కలిసి జీవనం సాగిస్తున్నాడు. టమాట కూర సరిగా వండలేదని కోడలు నందిని అత్త తిట్టింది. భర్త ఇంటికి రాగానే తనని తిట్టిందంటూ అతడికి భార్య ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త మహేందర్ నా భార్యను మందలిస్తావా ? అంటూ కోపంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బంధువులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.