Monday, November 25, 2024

మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తా:ఎంఎల్‌ఎ సంజయ్‌

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల మాస్టర్‌ప్లాన్‌ను ఏ ఒక్క రైతుకు కూడా నష్టం కలుగకుండా రూపొందిస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి 20యేళ్లకు ఒకసారి మాస్టర్‌ప్లాన్ రూపొందించాలనే నిబంధన మేరకు పట్టణ ముసాయిదా మాస్టర్‌ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. అయితే అధికారుల తప్పిదంతో పట్టణ పరిసర గ్రామాలకు చెందిన రైతుల భూముల్లో పలు జోన్‌లను ఏర్పాటు చేయడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారన్నారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌పై 60రోజుల్లోపు అభ్యంతరాలుచెప్పే అవకాశంఉందని, రైతులు తమ అభ్యంతరాలను సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.

మాస్టర్‌ప్లాన్ వల్ల రైతుల భూములకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు తమ రాజకీయ ఉనికికోసం పట్టణ శివారు గ్రామాల ప్రజాప్రతినిధులను, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సర్పంచ్‌లను, ఎంపిటిసిలను బలిపశువులనుచేసే కుట్రకు తెరలేపారన్నారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌కు ఎంఎల్‌ఎ బాధ్యత వహించాలని మాట్లాడుతున్నారని, రైతుల ఆవేదనను అర్ధం చేసుకుని తాను ముసాయిదా మాస్టర్‌ప్లాన్ రద్దు చేయిస్తానని తాను గతంలోనే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. మాస్టర్ ప్లాన్‌లో కొన్ని తప్పిదాలు జరిగిన మాట వాస్తవమేనని, జోన్‌లకు సంబంధించి రైతుల భూమలు లేకుండా సవరించనున్నట్లు తెలిపారు. రైతుల అభీష్టానికి వ్యతిరేకంగా వారి భూములను మాస్టర్ ప్లాన్‌లో చేర్చడం జరగదన్నారు.

గత మాస్టర్‌ప్లాన్ తప్పులతడకగా రూపొందించి, జోన్‌లు ఏర్పాటుచేయడంవల్ల భవన నిర్మాణాలకు అనుమతులు రాక చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జివోలో అభ్యంతరాలుంటే 60 రోజుల్లోగా స్వీకరించి వాటి వివరాలతో తిరిగి అప్పగించాలని సూచించిందే తప్పా.. ఇదే ఫైనల్ అని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీని, ఆ నేతలను ప్రజలు మరిచిపోయారని, నేతలు పదవులు లేక రాజకీయ నిరుద్యోగులుగామారి తమ ఉనికికోసం సమస్యలు లేవనెత్తుతున్నారని సంజయ్‌కుమార్ ఆరోపించారు. మాస్టర్ ప్లాన్‌లో రైతుల సెంటు భూమి కూడా పోకుండా చూస్తానని, అవసరమైతే మాస్టర్ ప్లాన్‌లో జోన్‌ల కోసం ప్రభుత్వ భూములను చేర్చుతామన్నారు.

పట్టణ శివారు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనంచేయాలనే ప్రతిపాదనవచ్చినా తాను గ్రామాలను పట్టణంలో కలపలేదన్నారు. అటు సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి పట్టణాల పరిసరాల గ్రామాలన్నింటినీ ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేసినా తాను మాత్రం గ్రామాలను విలీనం చేయలేదని ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ గుర్తు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, అల్లె గంగసాగర్, గుగ్గిళ్ల హరీష్, ఆవారి శివకేసరి బాబు, నాయకులు వొళ్లెం మల్లేశం, వల్లెపు మొగిలి, సింగరావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News