మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకునే సమయం ఆసన్నమైందని రాష్ట్ర పరిశ్రమలు, శాఖ మంత్రి కె .తారకరామారావు. రాష్ట్రం అభివృద్ధి పట్ల తన నిబద్ధతను చాటుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి రాబోయే బడ్జెట్‌యే అత్యంత ఉత్తమమైన సందర్భమన్నారు. త్వరలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ (2023-2024)లో రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణకి వివి ధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన సహాయంపైన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన కెటిఆర్ శనివారం పరిశ్రమల శాఖ చేపట్టిన పలు కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించాల్సిన బడ్జెట్ నిధులపై కేంద్ర ప్రభుత్వానికి లేఖస్త్రాన్ని సంధించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధికి దోహద పడే పలు అంశాలపైన సానుకూలంగా స్పందించాలని కేంద్ర ఆర్థి క శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు కెటిఆర్ విజ్ఞ ప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుం చి వినూత్నమైన పారిశ్రామిక విధానాలతో అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తున్నామని ఆ లేఖలో కెటిఆర్ వివరించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకు అనుగుణంగా బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టామన్నారు. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్ పార్క్‌తో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ ఫార్మాక్లస్టర్, హైదరాబాద్ ఫార్మాసిటీకి భారీ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇటువంటి భారీ పారిశ్రామిక పార్కులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే, కాకుండా జాతీయ ప్రాధాన్యత కలిగి దేశ పారిశ్రామిక అభివృద్ధికి సైతం ఇతోధికంగా ఉపయోగపడతాయన్నారు.
కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భరభారత్ వంటి నినాదాలు, విధానాలను బలంగా నమ్మితే, వాటిని నిజం చేయగలిగే శక్తి కలిగిన తెలంగాణ వంటి అభివృద్ధికాముఖ రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కెటిఆర్ తన లేఖలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలు బలంగా మారినప్పుడే దేశ ప్రగతి వేగంగా మరింతగా ముందుకు పోతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశ పారిశ్రామిక రంగంలో తన స్వల్పకాలిక ప్రస్థానంతోనే అత్యంత కీలకంగా మారిన తెలంగాణను కనీసం ఈ బడ్జెట్‌లోనైనా భారీగా నిధులు కేటాయించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి బడ్జెట్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా దక్కాల్సిన నిధులపైన అనేక సందర్భాల్లో కేంద్రానికి విజ్ఞప్తి చేసినా, చెప్పుకోతగిన ఆర్థిక సహాయమేదీ అందలేదని కేంద్ర ఆర్ధిక మంత్రికి రాసిన లేఖలో కెటిఆర్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన లేఖలో కెటిఆర్ పొందు పరిచిన ప్రధాన అంశాలివే
1. జహీరాబాద్ లో ఏర్పాటుచేస్తున్న నిమ్జ్‌లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు ఇవ్వాలి. ఇదే అంశంపై ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని ఈ సందర్భంగా కెటిఆర్ ప్రస్తావించారు. రూ. 9,500 కోట్ల మేర ప్రాజెక్టు వ్యయం అంచనాలు ఉన్నాయని, ఇందులో కనీసం రూ 500 కోట్లనైనా వెంటనే మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరారు.
2. హైదరాబాద్….-వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్…-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లకు అవసరమైన నిధుల కేటాయించాలి. అలాగే ఇతర విషయాలకు బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత కల్పించాలి. హైదరాబాద్ ఫార్మాసిటీ, జహీరాబాద్ నిమ్జ్‌ను కలిపేందుకు అవసరమైన రెండు నోడ్స్‌కు దాదాపు రూ. 5వేల కోట్ల మేర ఖర్చు అవుతుందని, ఇందులో కనీసం 50 శాతాన్ని ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
3. హైదరాబాద్….-విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. ఈ కారిడార్ లో భాగంగా హుజురాబాద్ ,జడ్చర్ల, గద్వాల్ కొత్తకోట నోడ్స్‌లను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, ఇందుకోసం సుమారు రూ. 5000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనాలు సిద్దం చేశామని, ఇందులో ఈ సంవత్సరం కనీసంగా రూ. 1500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలని కెటిఆర్ కోరారు.
4.టైస్ పథకం కింద జడ్చర్ల ఇండస్ట్రియల్ పార్క్‌లో కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం అవసరమైన గ్యాస్ కేటాయింపులను వెంటనే ప్రకటించాలని కోరారు.
5. బ్రౌన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ల మంజూరుతో పాటు వాటిని అప్‌గ్రేడేషన్ చేయాలి
6. ఆదిలాబాద్‌లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) యూనిట్‌ని మళ్లీ ప్రారంభించాలి.
7. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
8. హైదరాబాద్ ఫార్మా సిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి.
9. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలి.
10.వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి. ఈ ప్రాజెక్టు కోసం కనీసం రూ. 500 కోట్ల మూలధన ప్రోత్సాహాన్ని కేంద్రం అందించేందుకు వీలుందన్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌లో రూ.300 కోట్లను కనీసంగా ప్రకటించాలని కోరారు.
11. సమగ్ర పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ కింద టెక్స్‌టైల్ పార్క్, వీవింగ్ పార్క్, అపెరల్ పార్క్‌లతో కూడిన మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ను సిరిసిల్లకు మంజూరు చెయ్యాలి.
12. ఇన్‌సిటు పథకం కింద పవర్‌లూమ్‌ల అప్‌గ్రేడేషన్ చేయాలి
13. ఎన్‌హెచ్‌డిపికింద బ్లాక్ లెవల్ హ్యాండ్లూమ్ క్లస్టర్ల మంజూరు చేయాలి
14. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలి
15. చేనేత రంగానికి జిఎస్‌టిని మినహాయించాలి.
16. హైదరాబాద్‌లో నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ క్యాంపస్‌ను నెలకొల్పాలి
17. హైదరాబాద్ ఐF అభివృద్ధి కోసం ఐటిఐఆర్‌ను మంజూరు చేసే విషయాన్ని తిరిగి పరిగణలోకి తీసుకోవాలి. లేదంటే దానికి సమానమైన ప్రాజెక్టును ఇవ్వాలి
18. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టం.. 2014 చట్టం ప్రకారం ఖమ్మంలో సెయిల్ ద్వారా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
19. రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందివ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో కెటిఆర్ సూచించారు.