జ్యూరిచ్: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’లో భాగంగా ఎన్‌ఆర్‌ఐల మీట్ అండ్ గ్రీట్ ప్రొగ్రామ్‌లో తెలంగాణ ఐటి అండ్ ఇండస్ట్రీస్ మంత్రి కె.టి. రామారావు పాల్గొన్నారు. ఈ ఫోరమ్ సమావేశాలు నేడు ప్రారంభమై జనవరి 20 వరకు కొనసాగనున్నాయి. ప్రవాస భారతీయులు నిర్వహించిన కార్యక్రమంలో కెటిఆర్ స్విట్జర్లాండ్, యూకె, డెన్మార్క్, జర్మనీ, నార్వే తదితర దేశాలకు చెందిన ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల ప్రపంచ రాజధానిగా భారత్ అవతరించిందన్నారు. పేదల సంక్షేమంపై అవగాహన, నిబద్ధత లేని కొన్ని రాజకీయ పార్టీలు అల్పాదాయ వర్గాల అభివృద్ధి కార్యక్రమాలను ఆక్షేపిస్తున్నాయన్నారు. ‘దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహనలేని వ్యక్తులు పేదల సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను ఉచితాలుగా(ఫ్రీబీస్) అభివర్ణిస్తున్నాయి’ అన్నారు.
“ప్రధాని నరేంద్ర మోడీయే కావొచ్చు లేక మరెవరైనా కావొచ్చు…ఎవరైతే పేదలకు అందించే సాయాన్ని వ్యతిరేకిస్తున్నారో వారిదంతా తప్పుడు అభిప్రాయమే” అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించే వారిని ఆయన ఖండించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయోగపడే ఎన్నో మెగా ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిచేసిందన్నారు. ‘ఈ ప్రాజెక్టులన్నీ భావి తరాల కోసం అభివృద్ధి చేసినవి. కానీ దురదృష్టం కొద్దీ కొన్ని వర్గాలు వీటిని భావితరాల అప్పులుగా ముద్రవేస్తున్నాయి’ అన్నారు.
బిజెపి ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ‘ రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం లేక ప్రధాని ఒక్క మేజర్ ప్రాజెక్టు లేక పేదల కోసం ఒక్క సంక్షేమ కార్యక్రమమైన పేర్కొనగలరా?’ అన్నారు. ‘తెలంగాణలో మరింత ఉపాధి కల్పించడానికి మరింత పెట్టుబడి పెట్టండి’ అని ఆయన ఎన్‌ఆర్‌ఐలకు విజ్ఞప్తి చేశారు.