Monday, December 23, 2024

బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు భారీగా జన సమీకరణ…

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ నగరం నుంచి 2లక్షలమంది తరలింపుకు ప్లాన్
10వేల వాహనాలను సిద్దం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు
ఇప్పటికే పలు మార్లు నియోజకవర్గాల నేతలతో సమావేశాలు
ప్రతి డివిజన్‌కు ఒక బస్సును ఏర్పాటు చేసిన పార్టీ సీనియర్లు

 

మన తెలంగాణ,సిటీబ్యూరో: గులాబీ పార్టీ ఈనెల 18న ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం వద్ద తలపెట్టిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభను యావత్ దేశ దృష్టిని ఆకర్షించి, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని పార్టీ పెద్దలు పేర్కొనడంతో గ్రేటర్ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సభితా ఇంద్రారెడ్డి భారీగా జన సమీకరణకు ప్లాన్ చేశారు. ఈసభను సక్సెస్ చేసి కమలం పార్టీ హస్తిన పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తామని సవాల్ విసురుతున్నారు. అభివృద్దికి మారు పేరుగా నిలిచిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భవిష్యత్తులో దేశ ప్రజలకు సేవలందించేలా చేస్తామని పార్టీ శ్రేణులు తొడగొడుతున్నారు. 24 నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మంది తరలించేందుకు ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.

ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్దానిక కార్పొరేటర్లు, నామినేటెడ్ చైర్మన్లు ద్వితీయ శ్రేణి నాయకులతో సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించారు. రూట్‌మ్యాప్, ఎన్ని వాహనాలు అవసరం, పార్కింగ్ తదితర విషయాలను సీరియస్ తీసుకోవాలని పార్టీ పెద్దలు పేర్కొన్నారు. నగరం నుంచి ఆర్టీసీబస్సులు, కార్లు, ప్రైవేటు ట్రావెల్స్, ఇతర సంస్దలకు చెందిన బస్సులను కలిపి 10వేల వాహానాలను సిద్దం చేశారు. ఒక వాహనానికి ఒకరిని ఇంచార్జీగా నియమించి 50 మంది వచ్చేలా సూచనలు చేశారు. సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆహారం, త్రాగునీరు ఏర్పాటు చేశారు. ఈసభకు నగరంలో నివసిస్తున్న ఆంద్ర సెటిలర్లను పెద్ద సంఖ్యలో తరలించేందుకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు వారి పరిధిలో సుమారు లక్షమంది తరలించేలా డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి జనాలు సిద్దం చేశారు.

ఈ ఆవిర్భావ సభకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ సిఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆఖిలేష్‌యాదవ్‌తో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, సిపిఎం,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం హాజరైతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు వామపక్షాల నేతలు కూడా సభకు తరలివస్తున్నారు. ఈసభతో దేశ రాజకీయాల్లో మార్పు రావడం ఖాయమనే విశ్వాసం ప్రజలకు కల్పిస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, పార్టీ నాయకులపై విమర్శలు చేసే నాయకుల నోటికి తాళం వేస్తామని ఆపార్టీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News