న్యూఢిల్లీ: మంజూరైన బెయిల్‌కు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరైన వ్యక్తికి సంబంధించి దర్యాప్తులో తీవ్రమైన ఆరోపణలు చార్జ్‌షీట్‌లో నమోదు చేస్తే బెయిల్ రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక కారణాలతో బెయిలు రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసి విడుదలైన అనంతరం మళ్లీ బెయిల్ రద్దు చేయాలన్న వాదనను కోర్టు అంగీకరిస్తే న్యాయ విచారణకు విఘాతం కలుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్‌తో కూడి ద్విసభ్య బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడు తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడని చార్జ్‌షీట్‌లో నమోదు చేసినంతనే బెయిల్ రద్దు కాదని న్యాయస్థానం కూడా ఆరోపణలను నాన్‌బెయిల్‌బుల్ నేరంగా విశ్వసించాలని ధర్మాసనం పేర్కొంది.
అప్పుడే నిందితుడికి మంజూరైన బెయిల్‌ను రద్దు చేసే అవకాశం ఉంటుంది. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సిఆర్‌పిసి) 167 (2)ప్రకారం ఓ వ్యక్తి బెయిల్‌పై విడుదలైన తర్వాత బెయిల్‌ను రద్దు చేయడం కుదరదు. అయితే నమోదైన కేసు దర్యాప్తు అనంతరం దాఖలు చేసిన చార్జ్‌షీటును న్యాయస్థానం పరిశీలించాలి. బలమైన కేసు అని న్యాయస్థానం నమ్మితే బెయిలు రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. సిఆర్‌పిసి (5), 439 (2), ఇతర సెక్షన్‌ల ప్రకారం బెయిల్ మంజూరై నిందితుడు విడుదలైనా దాన్ని రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. కాగా నిందితుడిపై పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు 60నుంచి 90రోజులలోగా చార్జ్‌షీటు దాఖలు చేయడంలో విఫలమైతే చట్టబద్ధంగా బెయిలు పొందే లభిస్తోంది.