Wednesday, December 25, 2024

బిజెపి 104 ఎంసిడి సీట్లు గెలవడానికి గవర్నర్ తోడ్పడ్డారు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో బిజెపి 104 సీట్లను గెలువడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోడ్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆరోపించారు. వినయ్ కుమార్ సక్సేనా తాము సమావేశమైనప్పుడు ఈ విషయం చెప్పారని ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో మొత్తం ఏడు సీట్లు గెలువడానికి తాను బిజెపికి తోడ్పడుతున్నట్లు సక్సేనా తనతో చెప్పారని తెలిపారు. 2025లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తిరిగి అధికారంలోకి రాకుండా చూడబోతున్నానన్నారు.

‘ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నారు. ఆయన లక్షం పనిచేయడం కాదు, ఎన్నికైన ప్రభుత్వం పనిచేయకుండా చూడడం. ముఖ్యమంత్రిని, ఆప్‌ను అపఖ్యాతి పాలుచేయడం’ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య రచ్చ జరుగుతోందని కూడా అన్నారు. సక్సేనా గవర్నర్ పదవిలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు పొడసూపాయన్నారు. గవర్నర్ ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలువకుండా ఉండేందుకు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, మొహల్లా క్లీనిక్కులు, ఢిల్లీ జల్ బోర్డ్‌లలో ఉద్యోగుల జీతాలు ఆపేశారన్నారు. ‘ఎంసిడి ఎన్నికల్లో 20 సీట్లు కూడా గెలువలేని స్థితిలో ఉన్న బిజెపి తన వల్లే 104 సీట్లు గెలిచిందని గవర్నర్ చెప్పారు. అది దిగ్భ్రాంతి కలిగించింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. కానీ దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

30 మంది ఢిల్లీ గవర్నమెంట్ టీచర్లు విదేశీ శిక్షణ కార్యక్రమానికి వెళ్లాలనుకోవడాన్ని సక్సేనా అనుమతించలేదన్నారు. ఇండియాలోనే శిక్షణ తీసుకోవలన్నారట. ‘ఇది వారి మనస్తత్వం. పేద పిల్లలు మంచి విద్యను పొందకూడదన్నది వారి ఉద్దేశ్యం’ అన్నారు. తమ పనిలో గవర్నర్ కలుగజేసుకుంటున్నారని, ఆయనది భూస్వామ్య మనస్తత్వం అన్నారు. దేశం ఎప్పటికీ పేద దేశంగా ఉండాలన్నదే వారి మనస్తత్వం అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 1000 మంది టీచర్లను విదేశాల్లో శిక్షణ పొందడానికి పంపించిందన్నారు. గుణాత్మక విద్యను అందించడంలో వారు కీలక పాత్ర పోషించారన్నారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్ రెండుసార్లు ఫైళ్లపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఆయనకు దురుద్దేశాలున్నాయి. మేము మూడోసారి ఫైలును పంపినా ఇదివరకటి గతే పట్టనుంది. పబ్లిక్ ఆర్డర్, భూమి, పోలీసు విషయాల్లో నిర్ణయాలు తీసుకోడానికి లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది’ అని కేజ్రీవాల్ తెలిపారు. ప్రతి పిల్లాడికి గుణాత్మక విద్యను అందించాలన్నదే తన ధ్యేయం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News