ప్రపంచం లోనే భారీ హిమఖండంగా పేర్కొనే అంటార్కిటికా అడుగున ఒక నగరం అంత పరిమాణంలోగల సరస్సును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సరస్సుకు లేక్ షోఈగిల్ అని పేరు పెట్టారు. తీరానికి కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్న అంటార్కిటికా ప్రిన్సెస్ ఎలిజెబెత్ ల్యాండ్ ప్రాంతంలో మంచుఖండం అడుగున మైలు లోతు లోయలో ఈ సరస్సు కనిపించింది. దాదాపు 370 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఫిలడెల్ఫియా నగరం అంత పరిమాణంలో ఈ సరస్సు ఉండడం విశేషం. ఈ సరస్సు లోని అవశేషాలు తూర్పు అట్లాంటిక్ మంచు ఫలకం మొదట ప్రారంభంలో ఏర్పడిన నాటి భౌగోళిక చరిత్రను తెలియజేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. అంటార్కిటికా మంచు గడ్డకట్టక ముందు ఎలా ఉండేదో, వాతావరణ మార్పులు ఏ విధంగా ప్రభావం చూపించాయో , భూతాపానికి ఈ మంచు ఫలకం ఎలా కరిగిపోతుందో ఇవన్నీ తెలుస్తాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ లేక్ షో ఈగిల్ రెండు మైళ్ల పొడవునా మంచుతో కప్పబడి ఉంది. అయితే పరిశోధకులు తమ విమానానికి మంచులో చొచ్చుకుపోయే కాంతి కిరణాలతో కూడిన రాడార్‌ను అమర్చారు. దీనివల్ల రేడియో తరంగాలను లోపలికి పంప గలిగారు. తిరిగి ఇవి పరావర్తనం చెందడానికి ఎంతకాలం పడుతుందో గమనించారు. తూర్పు అంటార్కిటిక్ మంచు ఫలకం మొత్తం చరిత్ర తాలూకు రికార్డు ఈ సరస్సు అని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది 34 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని, అప్పటి నుంచి హిమనదీ వలయాలు మీదుగా తరతరాలుగా ఈ సరస్సు పరిణామం చెందుతూ పెరుగుతోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 10,000 సంవత్సరాల క్రితమే ఈ మంచు ఫలకం గణనీయంగా మార్పు చెందిందని తెలిపారు. సరస్సు లోని అవశేషాల అడుగున భూగర్భ జలాలను కూడా మొట్టమొదటిసారి కనుగొన్నారు.
అంటార్కిటికా అడుగున భారీ సరస్సు
- Advertisement -
- Advertisement -
- Advertisement -