Monday, November 25, 2024

60 ఏళ్లలో తొలిసారి తగ్గిన చైనా జనాభా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: చైనాలో జనాభా తగ్గుతుండడం భారత్‌కు ఓ మేలుకొలుపు హెచ్చరిక కావాలని నిపుణులు అంటున్నారు. జనాభా నియంత్రణ కోసం ఏదయినా బలవంతపు నిర్ణయం తీసుకుంటే అది వ్యతిరేక ప్రభావాన్ని చూపించే ప్రమాదం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాలో గత అరవై ఏళ్లలో తొలిసారి గత ఏడాదిలో జనాభా గణనీయంగా తగ్గినట్లు జాతీయ గణాంకాల బ్యూరో ప్రకటించింది. సుమారు 140 కోట్ల జనాభా కలిగి ఉన్న చైనాలో ప్రస్తుతం జననాల రేటు తగ్గినట్లు అంచనాకు వచ్చారు. 2020 చివరి నాటికి చైనా జనాభా 141.75 కోట్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే జనాభా 8,50,000 తగ్గినట్లు తేల్చారు. గత ఏడాది చైనాలో సుమారు 95 లక్షల మంది జన్మించినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పేర్కొంది. ఇక మరణించిన వారి సంఖ్య కోటీ 4 లక్షలున్నట్లు తెలిపింది.

మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్ మధ్య నాటికి చైనాను వెనక్కి నెట్టిభారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాభాను అదుపు చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు గనుక బలవంతంగా ఏవైనా చర్యలు చేపడితే అవి ఆశించిన ఫలితాలను కాకుండా వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘చైనా అనుసరించిన కఠినమైన జనాభా నియంత్రణ చర్యలే ఇప్పుడు ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయి. ఇప్పుడు ఆ దేశంలో పని చేసే యువతకన్నా కూడా వయసు మళ్లిన వారి జనాభానే ఎక్కువ ఉంది, ఇప్పుడు సిక్కిం, గోవా, జమ్మూ, కశ్మీర్, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్, లడఖ్, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్ లాంటి రాష్ట్రాలు కూడా ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి’ అని ‘పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ అనే స్వచ్ఛంద సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.

చైనాలో జనాభా విపరీతంగా పెరిగపోతూ ఉండడంతో అక్కడి ప్రభుత్వం ఒక జంటకు ఒక సంతానం అనే విధానాన్ని తీసుకువచ్చింది. దీనివల్ల జనాభా నియంత్రణ అయితే జరిగింది కానీ స్త్రీపురుష నిష్పత్తిలో తీవ్ర అంతరంతో పాటుగా వయో వృద్ధుల సంఖ్య కూడా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో చైనా మొత్తం జనాభాలో 15 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారు 22.9 శాతం ఉండగా 2020 నాటికి అది 13.3 శాతానికి తగ్గిపోయింది. అదే సమయంలో 2010 లో 60 ఏళ్లు పైబడిన వారు మొత్తం జనాభాలో 13.3 శాతం ఉండగా 2020 నాటికి అది 18.7 శాతానికి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం జనాభా నియంత్రణ విధానంలో మార్పులు తీసుకువచ్చి ముగ్గురు సంతానం దాకా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

అధిక జనాభా మన దేశానికి మానవ వనరుల సంపద అని దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి స్త్రీపురుష సమానత్వంతో కూడిన విద్య, ఆరికాభివృద్ధి, కుటుంబ నియంత్రణ సేవలు అందుబాటులోకి తేవడం లాంటి వాటిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని పాపులేషన్ ఫౌండేషన్‌ఆఫ్ ఇండియా పేర్కొంది. జనాభా విషయంలో మనం ఏ దేశాన్నీ ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం లేదని, ఎందుకంటే మనకు యువతే పెద్ద ఆస్తి అని సెంటర్ ఫర్ అడ్వకసీ అండ్ రిసెర్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఖిల శివదాస్ అభిప్రాయపడ్డారు. ప్రతికూల స్త్రీపురుష సంతాన నిష్పత్తి, పెరిగిపోతున్న వయోవృద్ధుల జనాభాతో పాటుగా యువ జనాభాకు సంబంధించిన సవాళ్లను ఒక దేశంగా మనం ఎలా అవకాశంగా మలుచుకోగలమన్నదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న అని ఆమె అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News